ఏది పొందాలో అది పొందుతే ధన్యుడు అంటారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ధన్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 957 వ నామం.

" ధన్యా " అంటే కృతార్ధురాలు. ఏది పొందాలో అది పొందుతే ధన్యత అంటారు.

విష్ణుసహస్రంలో " ధన్యః " అని ఒక నామం. కృతార్ధుడయినట్టివాడు అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.

ఆదిశంకరులు " ప్రశ్నోత్తర రత్నమాలిక " లో ఇలా అంటారు:

" కో ధన్యః? సన్యాసీ, 

  కః మాన్యః? పండితః, 

  కః సేవ్యః? యః దాతాః, 

  కః దాతా? యః అర్ధి మాతనుతే " 

ధన్యుడు ఎవరు? అంటే సన్యాసి అన్నారు శంకరులు. సన్యాసికి ఏకోరికలు ఉండవు, ఏది జరిగినా అమ్మవారి సంకల్పం అనుకుంటారు. ఎవరి మీదా ప్రేమ ఉండదు, కోపమూ ఉండదు. ఏ ప్రదేశమూ తనదనుకోడు. దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఎవరయినా పెడితే తింటాడు లేకపోతే పస్తులుంటాడు.

సంసారంలో ఉంటూనే సన్యాసిలా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు మహాత్ములు. ఆయనకేమండీ ధన్యుడు, ఆయన జీవితం ధన్యం అనడం అప్పుడప్పుడు వింటూంటాం. 

మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి సంగతులు ఎవరు ఎప్పుడు చదివినా ఆశ్చర్యపోవడం ఖాయం. ఆయన వేదాభ్యాసం చేసారు. బ్రహ్మ సూత్రాలు, మహాభాష్యం చదివారు. 50 కి పైగా భాషలను నేర్చుకున్నారు. అద్భుత సాహిత్యంతో " శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా ( రహస్యం సినిమా )" పాట వ్రాసినది ఆయనే. ఆయన ధన్యుడు, ఆయన జీవితం ధన్యం.

అమ్మవారికి పొందవలసినది లేదు, పొందలేనిది లేదు, పొందిందీ లేదు. ధన్యత సహజంగా ఉండడం వల్ల అమ్మవారు ధన్యా అని ప్రార్ధింపబడుతున్నారు.

అటువంటి ధన్యతని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

  1. లభించింది తింటూ యే కోరికలు లేకుండా జీవించటం అలవాటు చేసుకున్న వ్యక్తికి దొరికిన మనశ్శాంతి కోరికలతో నిత్యం నివసించే వ్యక్తికి దొరకదు.

    ReplyDelete
  2. " అశాంతస్య కుతః సుఖం ( భ.గీత 2:66 ) " అన్నారు పరమాత్మ. ఎప్పుడూ అశాంతిగా ఉండేవాడికి సుఖం ఎక్కడిది అని. శుభమస్తు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ