వేదఘోష మనశ్శాంతిని ఇస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శృతిసంస్తుతవైభవా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 929వ నామం.
" శృతిసంస్తుతవైభవా " అంటే వేదములచే స్తుతించబడిన వైభవము గలది అని అర్ధం.
శృతులు అంటే విన్నవి అని. అవి వేదములు. అపౌరుషేయాలు. ఎవరూ వ్రాసినవి కావు. ఋషులు తమ సమాధి స్థితిలో విన్న అమ్మవారు ప్రసాదించిన జ్ఞానం. ఎందరో ఋషులు విన్నవి. ఏ ఋషి విన్నదాన్ని ఆ ఋషి పేరుమీద కాండ అని పేరు పెట్టినట్లు తెలుస్తూంది. ఉదా: సోమ ఋషి విని గ్రహించినది సోమకాండ. అరుణ ఋషి విని గ్రహించినది అరుణకాండ.
వేదం విద్, అంటే జ్ఞానం, అనే ధాతువు నుంచి వచ్చింది. అంతా అమ్మవారి గుణగణాలే. వేదమే అమ్మవారు. వేదమాత అని కీర్తిస్తాం. వేదపారాయణని వేదఘోష అంటారు. అంటే అమ్మవారి గుణగణాలను ఎలుగెత్తి చాటడం.
అమ్మవారికి రాత్రి సహస్రనామపూజ, మహానివేదనం, తాంబూలం, మహామంత్రపుష్పం అయాక చామరసేవ జరుగుతూన్నప్పుడు వేదపారాయణ మొదలవుతుంది.
అమ్మవారు సృష్టి బాగోగులన్నీ చూసి కొంచెం అలసి ( అభిమాన సద్భావన ) ఉంటారు ఆసమయానికి. తాంబూలసేవన చేస్తూ చిరునవ్వుతో భక్తులను ప్రేమగా చూస్తూ ఉంటారు.
" ఋగ్వేదం అవధారయ " అనగానే ఋగ్వేద పండితుడు ఋగ్వేదాన్ని ఆలపిస్తాడు. యజుర్వేదం అవధారయ అనగానే యజుర్వేద పండితుడు, సామవేదం అవధారయ అనగానే సామవేదపండితుడు గానం చేస్తారు. అమ్మవారు చిరునవ్వుతో ఆలకిస్తూ ఉంటారు. వేదఘోషకు అమ్మవారు మురిసిపోతారు. ఆ ప్రాంతమంతా ఓ పవిత్ర వాతావరణం సంతరించుకుంటుంది. అక్కడ ఉన్న భక్తులందరూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
అవ్యాజకరుణామూర్తి.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment