గురుపూర్ణిమ/వ్యాసపూర్ణిమ నేడు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
శ్రీశ్రీశ్రీవేదవ్యాసుల జయంతి నేడు. ఈరోజుని గురుపూర్ణిమ/వ్యాసపూర్ణిమ గా జరుపుకుంటారు.
" గురుర్భ్రహ్మ గురుర్విష్ణుః
గురుర్దేవో మహేశ్వరః,
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ
తస్మైశ్రీ గురవేనమః "
గురువును ఎలా గౌరవించుకోవాలో తెలియచేసింది మన సనాతనధర్మం.
సనాతనధర్మానికి మూలపూరుషుడు వ్యాసర్షి. వేదాలన్నీ కలిసిపోయి ఉన్నప్పుడు వ్యాసులు వాటిని విభజించి ఓ క్రమపద్ధతిలో అందించారు మనకు. అవి అర్ధం చేసుకోవడానికి కష్టపడతారేమోనని 18 పురాణాలను అందించారు. పంచమవేదంగా కొనియాడబడుతున్న మహాభారతాన్ని 100700 శ్లోకాలతో అందించారు.
ఇప్పటికి ఎప్పటికీ నిత్యనూతనమైన భగవద్గీతని అందించారు. పరమపవిత్రమయిన విష్ణుసహస్రం, శివసహస్రం, ఎన్నో నీతికధలు మనకు అందించారు.
అయినా ఆయన మనస్సు సంతృప్తిచెందక వ్యాకులపడుతూన్నప్పుడు నారదమహర్షి సలహాతో మహాభాగవతాన్ని రచించి మనకు అందించారు.
మహాభారతంలో ఆయన ఇలా అన్నారు :
" యదిహాస్తి తదన్యత్ర
యన్నేహాస్తి నతత్ క్వచిత్ ".
దీని అర్ధం " భారతంలో ఉన్నదే ఎక్కడా ఉంటుంది, భారతంలో లేనిది ఎక్కడా ఉండదు " అని. అంతటి అద్భుతమైన గ్రంధం భారతం.
"న తత్ పరస్య సందధ్యాత్
ప్రతికూలం యదాత్మనః"
ధర్మరాజు " మనిషి పాటించవలసిన అతి ముఖ్యమైన ధర్మం ఏమిటి " అని అడుగుతాడు భీష్ముణ్ణి.
అప్పుడు ఆయన ఇలా చెబుతాడు " ఎదుటి మనిషి ఏపని చేస్తే నీకు కోపం కష్టం, బాధ, అసౌకర్యం కలుగుతాయో ఆపని నువ్వు చెయ్యకపోవడమే అతి ముఖ్యమైన ధర్మం " అని.
ధర్మరాజు యక్షప్రశ్నలకు జవాబులిస్తూ ఎన్నో అద్భుతవిషయాలను మనకు తెలియచేసారు. యక్షుడు అడుగుతాడు " లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి " అని. ధర్మరాజు అంటాడు " తనకళ్ళముందే ఒక్కొక్కరూ చనిపోతూన్నా తనుమాత్రం శాశ్వతం అనుకుని నానా పాట్లూ పడుతూంటాడు మనిషి " అని. ఎంతటి అద్భుత పరిశీలన.
భారతంలో శాంతిపర్వంలో " భృగు - భరద్వాజ " మహర్షుల సంవాదం వస్తుంది. దానిలో వృక్షాలకు సంబంధించిన అద్భుతవిషయాలు ఉంటాయి. వృక్షాలకి ప్రాణముంది, స్పర్శ ఉంది, స్పందన ఉంది, దర్శనశక్తి ఉంది, శ్రవణశక్తి ఉంది అని. ఎంతటి అద్భుతవిజ్ఞానం. ఇప్పటికి కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి శాస్త్రజ్ఞులకి.
అందుకే వ్యాసుని మహాభారతం 5000 సం.లు ( కనీసం ) అయినా ఇంకా నిత్యనూతనంగా ఉంది, ఉంటుంది.
ఎంతో అద్భుతమైన విజ్ఞానాన్ని/సంస్కృతిని మనకు అందించిన వ్యాసమహర్షిని ఆయన జయంతిరోజున ఒకసారి మనస్ఫూర్తిగా తలచుకుని నమస్కరించుకుని గౌరవించుకుందాం.
" మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే,
తతః కిం తతః కిం తతః కిం తతః కిం ".
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete