సంశయం కలిగినప్పుడు మంచి గురువును పట్టుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నిస్సంశయా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 172 వ నామం .

" నిస్సంశయా " అంటే సంశయములు లేనిది. సంశయాలు ఎవరికి ఉంటాయి. తను చేసిన, చేస్తూన్న పని సరైనదేనా అనే అనుమానం ఉన్నవారికే. లేకపోతే తను చేయబోయే పని గురించి తెలియనప్పుడు. మరి అమ్మవారికి అటువంటి పరిస్థితి రావడానికి అవకాశమే లేదు కదా.

సంశయాత్ములయిన వారికి ఈ లోకమున గాని పరలోకమున గాని సుఖము లేదు అన్నారు పరమాత్మ:

" అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ
  సంశయాత్మా వినశ్యతి ।
  నాయం లోకోఽస్తి న పరో
  న సుఖం సంశయాత్మనః "
              - భ.గీత 4:40

" జ్ఞానము, విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు " అని.

పరమాత్మ గీతలో ఇలా అంటారు అర్జునుడికి ఓ సంశయం కలిగినప్పుడు:

" తద్విద్ధి ప్రణిపాతేన 

  పరిప్రశ్నేన సేవయా, 

  ఉపదేక్ష్యంతి తే జ్ఞానం 

  జ్ఞానినస్తత్త్వదర్శినః " 

              - భ.గీత 4:34

" నీకు సంశయం కలిగినప్పుడు మంచి గురువును పట్టుకుని సేవ చేసుకో. మంచి ప్రశ్నలు వేసి జ్ఞానం పెంచుకో " అని.

ఇక్కడ స్వామి చెప్పినది ఏ సంశయాన్ని అయినా గురువు తీరుస్తారు అని. అంటే గురువుకు ఏవిషయంలోనూ సంశయాలు ఉండవు. మరి అమ్మవారు గురువులకు గురువు, గురురూపిణి. ఆవిడకు సంశయాలు ఎందుకు ఉంటాయి, ఎలా ఉంటాయి. అందుకే అమ్మవారు నిస్సంశయ.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనకు కూడా ఏ సంశయాలూ ఉండవు, ఉన్నా తొలగిపోతుంటాయి.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ