బుద్ధిని శుభ్రపరుస్తూ ఉండాలి అప్పుడప్పుడు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" మేధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 538 వ నామం.
మేధా అంటే ధారణాశక్తి గల బుద్ధి స్వరూపురాలు. ధారణాశక్తి అంటే జ్ఞాపకశక్తి. కొందరు శతావధానం, సహస్రావధానం చేస్తూంటారు. కొందరు ఆసువుగా కవిత్వం చెబుతూంటారు. ఇటువంటివన్నీ అమ్మవారి అనుగ్రహం.
అంతఃకరణాలు నాలుగు - మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తము. మనస్సు సంకల్పవికల్పాలు అంటే మంచీ చెడూ రెండూ చేయిస్తుంది. బుద్ధి ఏది మంచో ఏది చెడో తెలియచేస్తుంది. ఈ విచక్షణాశక్తిని అమ్మవారు ప్రసాదిస్తుంది.
వేదంలో మేధాసూక్తం ఉంది. సూక్తం అంటే సు+ఉక్తం - మంచిగా చెప్పబడినది అని. అమ్మవారిని ఇలా ప్రార్ధన చేస్తాం:
ఓం మేధాదేవీ జుషమాణా
న ఆగాద్విశ్వాచీ భద్రా
సుమనస్యమానా త్వయా
జుష్టా నుదమానా దురుక్తాన్
బృహద్వదేమ విదధే సువీరాః
" అమ్మా మేధాదేవీ, నీ రాకకు పూర్వం నిరర్ధక ప్రసంగాలతో సంతోషపడే మేము నీ కృపాకటాక్షం చేత సద్బుద్ధి పొంది వీరులైన ప్రజలతోను, శిష్యులతోనూ ఉన్నత సత్యాలను మాట్లాడే సామర్ధ్యాన్ని సంతరించుకున్నాము " అని. అమ్మవారు బుద్ధిని ప్రేరేపించి అటువంటి సత్కాలక్షేపాలు చేసేలా అనుగ్రహిస్తుంది.
" అనాద్యవిద్యా యుక్తస్య
పురుషస్యాత్మ వేదనం
స్వతో న సంభవాదన్య
స్తత్త్వజ్ఞో జ్ఞానదో భవేత్ "
- భాగవతం 11:22:10
అనేకజన్మల నుండి బుద్ధి అజ్ఞానంతో కప్పబడి ఉండడం వల్ల మనిషి తన స్వీయ
ప్రయత్నంతో తన అజ్ఞానాన్ని తెలుసుకోలేడు. అతనికి పరమసత్యాన్ని ఎరిగిన, భగవత్ప్రాప్తి పొందిన మరొక వ్యక్తి తప్పనిసరిగా సహాయపడాలి. అతనే గురువు. ఆ గురువును అమ్మవారు ఏర్పాటు చేస్తారు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి చక్కటి గురువును అనుగ్రహించమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment