ప్రపంచ శాంతిని కోరేది సనాతనధర్మమే - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శమాత్మికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 963 వ నామం .
" శమాత్మికా " అంటే సకల ప్రపంచోపశమనమే స్వరూపముగా గలది అని. ఉపశమనం అంటే శాంతి. ఎంత అద్భుతనామం. ప్రపంచశాంతికి ప్రతిరూపం. అదీ మన సనాతనధర్మం ఉత్కృష్టత.
ఆదిశంకరాచార్య విరచిత " ప్రశ్నోత్తర రత్నమాలిక " లో ఇలా తెలియచేసారు:
" కిం సంపాద్యం మనుజైః?
విద్యా విత్తం బలం యశః
పుణ్యం కః సర్వగుణ
వినాశీ? లోభః శతృశ్చ కః? కామః "
మనుష్యుడు దేనిని సంపాదించవలెను?. విద్య ధనము కీర్తి బలము పుణ్యము అనే వాటిని. సమస్తగుణములను నశింప చేయునది ఏది? లోభము. శతృవు ఎవరు? కోరిక.
ఈవిషయములను తెలుసుకుని పాటించిన వ్యక్తి శాంతిగా ఉంటాడు. కుటుంబంలో అందరూ పాటిస్తే ఆ కుటుంబం శాంతిగా ఉంటుంది. కుటుంబాలు అన్నీ శాంతిగా ఉంటే ఊరు, దేశం, ప్రపంచం శాంతిగా ఉంటాయి.
ఎటువంటి విజ్ఞానాన్ని ఇచ్చింది ప్రపంచానికి మన సనాతనధర్మం. సమస్య ఏమిటి, పరిష్కారం ఏమిటి అని తేలిగ్గా అర్ధమయేలా తెలియచేసారు.
" న ఋతే శ్రాంతస్య సఖ్యాయదేవాః " - ఎవడైతే కష్టపడడో వానికి దేవుడుకూడా సహాయపడడు - ఋగ్వేదం. " ఋతం " అంటే ధర్మంగా ( కష్టపడి ) సంపాదించిన భోజనం.
సోమరితనంలేని నీతిపరులకు సంపద లభిస్తుంది, సోమరిపరులకు సంపద లభించదు అంది వేదం. తేరగా కష్టపడకుండా వచ్చే డబ్బుని వాడుకునేవారి వల్ల సమాజానికి, దేశానికి, ప్రపంచానికి నష్టం. ఇప్పుడు ప్రపంచ పరిస్థితికి కారణం ఏమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
ప్రపంచశాంతికి మన సనాతనధర్మం తప్ప వేరే దారి లేదు.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి ప్రపంచ శాంతిని ప్రసాదించమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment