ఆచారాలు పెట్టినది మన మంచికోసమే - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" సదాచారప్రవర్తికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 356 వ నామం.

" సదాచారప్రవర్తికా " అంటే సదాచారమును ప్రవర్తింపచేయునది అని అర్ధం. ఆచారము అంటే ఆచరించేది. ఆ ఆచరించేవి మనకు మన కుటుంబానికి సమాజానికి మంచి చేసేవిగా ఉండాలి. అందుకే అమ్మవారు సదాచారాలను అంటే మంచి ఆచారాలను అనుసరింపచేస్తుంది.

జీవుల మనుగడకోసం, సుఖజీవనం కోసం, మనశ్శాంతి కోసం కొన్ని ఆచారాలను పెట్టారు అమ్మవారు. ఋషులు వాటిని మనకు తెలియచేసారు. అవి పాటిస్తే జీవితం బాగుంటుందని, పాటించకపోతే బాధలు పడవలసి వస్తుందని తెలియచేసారు. 

సనాతనధర్మం పెద్దలను గౌరవించమంది. రెండుచేతులూ జోడించి నమస్కారం పెట్టమంది. భోజనం చేసేముందు కాళ్ళు చేతులు కడుగుకోమంది. బయట తిరిగి వచ్చినా, వేరే ఊరినుంచి వచ్చినా కాళ్ళు కడుగుకుని ఇంట్లోకి వెళ్ళమంది. శుభ్రమైన బట్టలు కట్టుకుని భోజనం చేయమంది. ఇటువంటి ఆచారాలెన్నిటినో మన బాగుకోసం తెలియచేసారు. ఇవేమీ కష్టమైనవో, ఆచరింపలేనివో కాదు.

ఇవి ఆచరించడంవల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కాని ఆశ్చర్యమేమిటంటే ఏదయినా భయంకరమయిన వ్యాధి ప్రబలినపుడు మాత్రమే ఇవన్నీ పాటిస్తారు అందరూ. 

ఇటీవల కరోనా వ్యాధి ప్రబలినప్పుడు కొందరు వీటిని పాటించి బ్రతికి బయటపడ్డారు. ముఖ్యంగా దూరంగా నుంచుని నమస్కారం పెట్టడంవల్ల కలిగే ప్రయోజనం బాగా తెలిసి వచ్చింది అందరికీ. కొందరు పాటించనివారు ఆసుపత్రిలో చేరి బాధపడడం, మృత్యువాత పడడం కూడా జరిగింది. 

పూజ్యులు సామవేదంవారు భాగవత ప్రవచనం చేస్తూ " ఆచారాన్ని పాటించనివారు లలితాసహస్రం, విష్ణుసహస్రం చదివినా దీపం పెట్టినా, పూజ చేసినా ఫలితం ఉండదు " అని తెలియచేసారు. శ్రీలలితాసహస్రనామ పారారణ చేస్తారు తరచుగా, అమ్మవారిని సదాచారప్రవర్తికా అని పూజిస్తారు. మరి ఆచారాలను పాటించకపోతే ఉపయోగమేమిటి అన్నారు. 

దేవాలయంలోకి శుచిగా శుభ్రమయిన, సాంప్రదాయకమయిన బట్టలు ధరించి వెళ్ళాలి. అలా చేయకపోతే వచ్చే నష్టం వెంటనే తెలియకపోవచ్చు. కాని దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అటువంటి వారివల్ల దేవాలయాల పవిత్రత కూడా పాడవుతుందన్నారు. ఈ విషయం ఇప్పుడు దేవాలయాల పరిస్థితి చూస్తే తెలుస్తూంది.

" ఆచారహీనం నపునంతి వేదాః " అన్నారు. అంటే " ఆచారహీనుడిని వేదం కూడా పవిత్రుడిని చెయ్యలేదు " అని తెలుసుకోవాలి.

అమ్మవారు మన పెద్దలద్వారా మనకు అందించిన ఆచారాలను పాటించి మన జీవితాలను సుఖమయం చేసుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ