అనురాగం/ప్రేమ కూడా ఎక్కువ మంచిది కాదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" రాగమధనీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 157 వ నామం .
" రాగమధనీ " అంటే భక్తులకు వైరాగ్యము కలిగించుటచే అనురాగమును పోగొట్టునది అని అర్ధం.
మన కష్టాలన్నిటికీ కారణం మితిమీరిన సంసారబంధాలే. ఒకటి రెండు తరాలకు కాకుండా పది తరాల వరకూ సరిపడేలా సంపాదించాలని కోరుకుంటూ నానా దుర్మార్గపు పనులూ చేస్తూంటారు కొందరు. కోరి కష్టాలు తెచ్చుకుంటూంటారు.
వైరాగ్యాన్ని కలిగించడం ద్వారా మితిమీరిన అనురాగాన్ని అంటే బంధాన్ని తగ్గిస్తారు అమ్మవారు తనను నమ్ముకున్న వారికి.
కుంతీదేవిని " ఇంతవరకూ ఎన్నో కష్టాలు పడ్డావు అత్తా. ఇటుపై సుఖపడడానికి ఏమి కావాలో కోరుకో " అంటారు పరమాత్మ. అప్పుడు కుంతి " నా పుత్రులమీద, వంశం మీద మమకారాన్ని/అనురాగాన్ని తగ్గించు కృష్ణా " అని కోరుకుంటుంది. ఉత్తమ ఇల్లాలు.
దేవహూతి భర్త కర్దమునితో ఇంతకాలం ఈ దేహంతో భోగాలన్నీ అనుభవించాను కాని జ్ఞాని అయిన భర్త లభించినా సత్యం ఏమిటో తెలుసుకునే ప్రయత్నమే మొదలు పెట్టలేదు అని చెబుతూ ఇలా అంటారు:
" నేహయద్కర్మ ధర్మాయ
న విరాగాయ కల్పతే
నా తీర్థపద సేవాయై
జీవన్నపి మృతోహితః "
" ధర్మకార్యాలు చేయనివాడు జీవించి ఉన్నా మరణించినవాని క్రింద లెక్క. ధర్మకార్యాలు చేస్తూ ఉన్నా ఫలాన్ని ఆశించకుండా అంటే వైరాగ్యంతో చేయకపోతే జీవన్మృతుడి క్రింద లెక్క. ఫలితాన్ని ఆశించకుండా ధర్మకార్యాలు చేస్తూన్నా అది భక్తిగా మారకపోతే మరణించినవాని క్రింద లెక్క " అన్నారు దేవహూతి.
అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అనవసరమయిన అనురాగాన్ని తగ్గిస్తారు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment