జ్ఞాని ఎవరు - సత్యం ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" జ్ఞానగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 980 వ నామం.
" జ్ఞానగమ్యా " అంటే జ్ఞానముచే పొందదగినది, జ్ఞానంచే ఆనందము కలిగించునది.
విష్ణుసహస్రంలో " జ్ఞానగమ్యః " అని ఒక నామం. దానికి " జ్ఞానము చేతనే తెలియబడువాడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.
జ్ఞాని ఎవరు?
శంకరులు " బ్రహ్మ సత్యం, జగన్మిధ్య " అన్నారు. అమ్మవారి స్పృహ తప్ప వేరే ఆలోచనలు ఉండవు జ్ఞానులకు.
ధృవుడు కుబేరుడి మీదకు కూడా యుద్ధానికి తయారయిపోతే తాత స్వాయంభువు మనువు వచ్చి " నువ్వు విష్ణువు దర్శనం పొందిన భాగవతోత్తముడవు. నీకు ఇటువంటి యుద్ధాలు అవసరమా " అనగానే ధృవుడు తామసగుణంలోంచి బయటపడ్డాడు. కుబేరుడు సంతోషించి వరం కోరుకోమంటారు ధృవుడిని. అప్పుడు ధృవుడు కోరుకున్నది " ఎల్లవేళలా విష్ణువు స్పృహలో ఉండేలా అనుగ్రహించమని కోరుకున్నాడు ". అలాంటి స్పృహలో ఉంటే అనవసరపు యుద్ధాలు, ఇతరవ్యాపకాలవైపు బుద్ధి పోదు అని ధృవుడి ఆలోచనగా తెలుసుకోవాలి.
శుకుడు వెడుతూంటే ప్రక్కన నదిలో స్నానం చేస్తూన్న స్త్రీలు తడిగుడ్డలతోటే ఒడ్డుకు వచ్చి నమస్కారం చేసి ఆశీర్వాదం పొందేవారు. అదే వ్యాసుడు వెడుతూన్నప్పుడు గబగబా పొడిబట్టలు చుట్టుకొనివచ్చి నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకునేవారు. అదే విషయాన్ని వ్యాసుడు ఆ స్త్రీలను అడిగితే " మీకు స్త్రీపురుష భేదం ఇంకా పోలేదు. శుకుడు జ్ఞాని " అన్నారుట. వ్యాసర్షి పరిస్థితే అది అయితే ఇక సామాన్యుల గురించి చెప్పేదేముంది.
అటువంటి జ్ఞానంలో వీసమెత్తు కావాలన్నా కఠోరసాధన అవసరం.
అమ్మవారి పాదాలను ఆశ్రయించి అటువంటి సాధనకు అవసరమయే శక్తిని ప్రసాదించమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment