తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" పుణ్యాపుణ్యఫలప్రదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 288 వ నామం.
" పుణ్యాపుణ్యఫలప్రదా " అంటే పుణ్యమునకు పుణ్యఫలం, అపుణ్యము ( పాపము )నకు పాపఫలం ఇస్తుంది అని.
అదేమిటండీ పాపం చేయకుండా ఆపవచ్చు కదా అనిపిస్తుంది, తప్పు లేదు. కాని అమ్మవారికి ఆ అవసరమేముంటుంది. ఆవిడ అన్ని ఏర్పాట్లూ చేస్తారు, బాగుపడమంటారు. అటు గుడి ఉంటుంది, ఇటు సారాయి దుకాణం ఉంటుంది. ఎటు వెడితే నయం అని మనం ఆలోచించు కోవాలి కదా.
తరగతిగదిలో ఉన్న విద్యార్థులు అందరూ ధూమపానం చేయరు. 4,5 గురు మాత్రమే దానికి అలవాటు పడతారు. ఎవరూ స్వతహాగా పాపపు పనులు చేయాలని అనుకోరు. వారి వారి గతజన్మల వాసనలు బట్టి చెడుకర్మలు కూడా చేస్తూ ఉంటారు.
మనకు తెలియకుండానే లేక మన ప్రమేయం లేకుండానే కూడా కొన్ని పాపాలు చేస్తూంటాం. తెలిసిచేసినా తెలియకచేసినా పాపఫలం కలుగుతుంది.
పసివాడు పాకుతూ వెళ్ళి నిప్పులో చేయి పెడితే కాలుతుంది. అయ్యో పసివాడు, ఏమీ తెలియనివాడు అని కాల్చకుండా ఉండదు నిప్పు. అంత నిక్కచ్చిగా ఉంటుంది ప్రకృతి.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
" శుభాశుభఫలైరేవం
మోక్ష్యసే కర్మబంధనైః,
సన్న్యాసయోగయుక్తాత్మా
విముక్తో మాముపైష్యసి "
- భ.గీత 9:28
" ఈ విధముగా సన్న్యాసయోగము నందు స్థిరచిత్తుడవై,అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుబాశుభఫలరూప కర్మబంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే చేరగలవు " అని.
సుఖంగా జీవించడానికి పుణ్యం చేయనక్కర్లేదు, పాపం చేయకుండా ఉంటే చాలు. అదే ధర్మసూక్ష్మం.
" తన్మే మనః శివసంకల్పమస్తు - సంకల్పసూక్తం " - మా మనస్సులలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలే కలిగించు తల్లీ అని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment