పుణ్యానికి పుణ్యఫలం పాపానికి పాపఫలం ఇస్తారు అమ్మవారు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అనఘా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 987 వ నామం.
" అనఘా " అంటే అఘములు అంటే పాపము దుఃఖము వ్యసనము లేనిది.
విష్ణుసహస్రంలో అనఘః అని ఒక నామం. దానికి ఆదిశంకరులు పాపరహితుడు అని భాష్యం చెప్పారు.
వ్యసనం దుఃఖాన్ని కలిగిస్తుంది, పాపం మిగులుతుంది చివరకు.
వ్యాసర్షి మహాభాగవతంలో పాపపు భవంతులకు పునాది లోభం అన్నారు. లోభం ఉన్నప్పుడు పాపం కలుగుతుంది.
అమ్మవారికి లోభం ఎందుకుంటుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి. ఆవిడ పొందవలసినది ఏముంది. సృష్టిలో అందరూ ఆవిడ బిడ్డలే. అందరికీ సమాన అవకాశాలే ఇస్తుంది. జీవుడి కర్మఫలాలను బట్టి అతనికి అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది.
" పద్మపత్రమివాంభసా " - తామరాకు మీద నీటిబొట్టులా ఉంటుంది అమ్మవారు. ఎవరికీ ఎక్కువా చేయదు, తక్కువా చేయదు.
గీతలో పరమాత్మ అంటారు:
" తేషామేవానుకంపార్ధం........
............జ్ఞానదీప్తేన భాస్వతే "
- భ.గీత 10:11
" నన్ను నమ్ముకున్నవారిని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి అనుగ్రహిస్తాను " అన్నారు.
జీవితం ధర్మబద్ధంగా ఉంటే చెడుపనులే ఉండవు, పాపం కలగడమే జరగదు.
ఎల్లవేళలా ధర్మమార్గంలోనే నడిచేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment