రేపటినుండి పరమ పవిత్రము, శుభకరము అయిన " శ్రీవారాహీదేవి " నవరాత్రులు - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీమాత్రేనమః " 🙏
రేపటినుండి పరమ పవిత్రము, శుభకరము అయిన " శ్రీవారాహీదేవి " నవరాత్రులు.
" విశుక్రప్రాణహరణ వారాహీవీర్యనందితా " - ఇది లలితాసహస్రరహస్యనామాల్లో 76 వ నామం.
దీని అర్ధం " విశుక్రుడి ప్రాణం హరించిన శ్రీవారాహీదేవి పరాక్రమానికి సంతసించినది " అని.
భండాసురుడి తమ్ముడైన విశుక్రుడిని సంహరించినది వారాహీదేవి.
వారాహీ అనే పేరే ఎంత అద్భుతంగా ఉంది. పలుకుతూంటేనే వళ్ళు పులకరిస్తుంది. ఆవిణ్ణి రక్షణమంత్రిగా నియమించింది అమ్మవారు మనల్ని జాగ్రత్తగా చూసుకోమని.
ఆవిడ ఒకచేతిలో నాగలి ఇంకోచేతిలో రోకలి ఉంటాయి. అంటే పంటలు పండించడం, ఆ పంటను దంచి ఆహారంగా చెయ్యడం కూడా ఆవిడే చూసుకుంటుంది. శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆవిడే. రక్షణమంత్రిగా శత్రుపీడ లేకుండా చేసేదీ ఆవిడే.
ఆవిడ రధం మీద ధన్వంతరి, అశ్వనీదేవతలు కూర్చుని ఉంటారు. ఇంక మన ఆరోగ్యానికి లోటెక్కడ.
ఆవిడ మహిషం మీద కూర్చుని, పులిమీద కూర్చుని కూడా దర్శనం ఇస్తూ ఉంటారు.
ఆవిడ ఇంకో వాహనం హంస. హంస అంటే ఊపిరి. సాధారణంగా అందరూ " జపగాయత్రి " చేస్తారు. అంటే ఏదో ఒక నామజపాన్ని చేసుకుంటూ ఉంటారు. కొందరు ఏనామాన్ని కాకుండా " అజపా గాయత్రి " ని చేస్తారు. అంటే ఊపిరి మీదే ధ్యాసపెడతారు. ఊపిరిలో అమ్మవారు ఉంటారు. అందుకే ఊపిరి ఎంతో లయబద్ధంగా ఉంటుంది.
" హంస హంసాయ విద్మహే
మహా హంసాయ ధీమహి
తన్నో హంస ప్రచోదయాత్ "
- హంస గాయత్రి.
ఆవిడ పాదాలు పట్టుకోవాలేకాని ఆవిడ ఇవ్వలేనిదంటూ ఉండదు. అవ్యాజకరుణామూర్తి.
అందరినీ చల్లగా చూడమని చల్లనితల్లి శ్రీవారాహీదేవిని కోరుకుందాం.
రేపటి నుంచి అనగా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శ్రీవారాహీదేవీ నవరాత్రులు. అందరికీ శుభాకాంక్షలు - సూర్య.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు.
శుభం భూయాత్
Nomovarahi mata
ReplyDelete