పంచభూతాలు అమ్మవారి రూపం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీమాత్రేనమః "🙏
" పంచమీ, పంచభూతేశీ, పంచసంఖ్యోపచారిణీ " అమ్మవారి అద్భుత నామాలు. ఇవి శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 948,949,950 వ నామాలు.
" పంచమీ " అంటే సదాశివుని స్త్రీస్వరూపురాలు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వరి సదాశివ - పంచతత్వాలు. పంచమీతత్వం అయిన సదాశివునికి ఈశ్వరి పంచమి.
వారాహీదేవిని కూడా పంచమి అని కొలుస్తారు. బ్రాహ్మీ వైష్ణవీ మాహేశ్వరీ కౌమారీ వారాహీ లలో వారాహీ పంచమం. ఈవిడ అహారప్రదాత. ఈవిడ ఆయుధాలు హలం ( నాగలి ), ముసలం( రోకలి). అంటే నాగలితో పండించడం, రోకలితో పండిన ధాన్యాలను దంచి ఆహారంగా ఇవ్వడం. ఎంతటి కరుణామయి, ఎంతటి అద్భుత ప్రక్రియ.
" పంచభూతేశీ " అంటే పంచభూతాలకి నాయకురాలు. భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం ఇవి పంచభూతాలు.
రమణమహర్షిని ఓ భక్తుడు అడిగారు " ఎప్పుడూ ఇక్కడే కూర్చోకుండా మానససరోవరం, కేదారనాధ్, నైమిశారణ్యం లాంటివి తిరిగి రావచ్చు కదా. కొత్త కొత్త విషయాలు చూడవచ్చు " అని. ఆయన అన్నారు " నాకూ తిరిగిరావాలనే ఉంది, ఎక్కడైనా మన పంచభూతాలు కాక ఆరవది కనిపిస్తే చెప్పు, వెంటనే వెళ్ళి చూసివస్తాను " అని. అందుకే ఆవిడ పంచభూతేశి అని కొలువబడుతూంది.
" పంచసంఖ్యోపచారిణి " అంటే పంచ ఉపచారాలను ఇష్టపడుతుందని. ఆదిశంకరులు పూజలకని 64 ఉపచారాలు ఏర్పాటుచేసారు. కుదరకపోతే షోఢశోపచారాలు చాలు. వీటిలో కూడా గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం - పంచోపచారాలను అమ్మవారు బాగా ఇష్టపడతారు. కొన్ని ఉపచారాలకు అవసరార్ధం అక్షతాని సమర్పయామి అని అనవచ్చుకాని ఈ ఐదు ఉపచారాలను మాత్రం శ్రద్ధగా చెయ్యాలి.
ఈనామ ప్రాముఖ్యం వల్ల నవరాత్రుల్లో పంచమి నాడు శ్రీలలితాదేవీ అవతారంలో పూజిస్తారు. ఆవిడది లలితమైన రూపం, హృదయం. ఆవిడ విల్లు చెరుకుగడ, బాణాలు పువ్వులు. అంతకోమలం.
అమ్మా అని పిలిస్తే చాలు అనుగ్రహించేస్తుంది.
ఈరోజు నుంచి శ్రీవారాహీదేవీ నవరాత్రులు. అందరినీ చల్లగా చూడమని " అవ్యాజకరుణామూర్తి " శ్రీవారాహీదేవిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment