నిద్ర ఒక వరం, అమ్మవారి అనుగ్రహం కావాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏 " శ్రీమాత్రేనమః " 🙏

" సుప్తా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 260 వ నామం.

" సుప్తా " అంటే కారణశరీరాభిమాని జీవాభిన్నస్వరూపురాలు అని తెలిపారు. జీవుడికి తన కారణశరీరంమీద ఎంతో అభిమానం. దానికోసం చాలా చేస్తూంటాడు. అటువంటి జీవికి భిన్నస్వరూపురాలు అమ్మవారు.

సుప్తమనగా ఆనందావస్థ అన్నారు పండితులు. శివసూత్రంలో సుప్తావస్థకు మూడు లక్షణాలు తెలియచేసారు. అవి అవివేకం, మాయ, సౌషుప్తము. ఈ అవస్థ ఒక అదృష్టం.

మనిషికి సాధారణమైన 3 అవస్థలు ఉంటాయి - అవి 1. చైతన్య/జాగృతి 2. స్వప్న 3. సుషుప్తి.

విష్ణుసహస్రనామాలలో " త్రిదశాధ్యక్షః " అని ఒక నామం. దానికి " జాగృతి, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థలకు సాక్షీభూతుడు " అని భాష్యం చెప్పారు ఆదిశంకరులు.

వివరంలోకి వెడితే మనిషి పగలంతా ఏదో ఒక పనిచేస్తూ చైతన్యంతో ఉంటాడు. రాత్రి నిద్రలో రెండు అవస్థలు - 1. కలలతో కూడిన నిద్ర లేక స్వప్నం 2. కలలు లేని గాఢ నిద్ర లేక సుషుప్తి. పొద్దున్న లేస్తాడు, మళ్ళీ చైతన్యం.

ఈ కలలు లేని నిద్ర " సుషుప్తి " ఒక భాగ్యం. అందరికీ అన్నివేళలా దొరకదు. సుఖావస్థ. " నిన్న రాత్రి ఏం గాలి, ఏం వర్షం " అనగానే " అవునా, నేను నిద్రపోయాను. ఏమీ తెలియనే లేదు " అనడం సాధారణంగా వింటూంటాం. " మిన్ను విరిగి మీదపడినా లేవడు " అంటూంటారు. అమ్మవారి అనుగ్రహం.

" స్వాపనః " అని ఇంకో అద్భుతనామం ఉంది విష్ణుసహస్రంలో. దాని అర్ధం " తనమాయతో ప్రాణులను నిద్రలో ఉంచువాడు " అని. ఇక్కడ నిద్ర అంటే అజ్ఞానం అనుకోవాలి. అదేమిటండీ అనిపించవచ్చు. అజ్ఞానం ఒక వరం కొన్ని విషయాలలో.

పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుత విషయం తెలియచేసారు. " నాకు తెలియదు " అని అన్నాడంటే అతను జ్ఞానే. తెలియదు అనే విషయం తెలిసింది కదా మరి, అన్నీ తెలుసు అనే మాయలో లేకుండా.

నిద్ర ఒక వరం. ఆనందావస్థ. దానికి అమ్మవారి అనుగ్రహం కావాలి. కోరుకున్నప్పుడు అటువంటి ఆనందావస్థని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ