కోరికలు గుర్రాలయితే జీవితం నరకం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" నీరాగా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 156 వ నామం . 

" నీరాగా " అంటే కోరికలు లేనిది - రాగా అంటే కోరిక. అమ్మవారికి కోరికలు ఎందుకుంటాయి. కోరిక దేనికి, ఏదయినా పొందడానికి. అమ్మవారు పొందవలసినదీ లేదు, పొందిందీ లేదు. అంతా అమ్మవారి సృష్టే కదా. 

అమ్మవారికి ఎవరిమీదా ప్రత్యేక అభిమానమూ ఉండదు, ద్వేషమూ ఉండదు. అందరూ ఆవిడ బిడ్డలే. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. మంచి ఆలోచనలు చేయండి, మంచి పనులు చేయండి, మనస్సు నిర్మలంగా ఉంచుకోండి అని హెచ్చరిస్తూనే ఉంటారు. కాని గతజన్మ వాసనలు అంత తేలిగ్గా వదలవు. 

నృసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోపెట్టుకుని నేను సంతుష్టుడయి ఉన్నాను, ఏదయినా కోరిక కోరుకో అంటారు.

అప్పుడు ప్రహ్లాదుడు " స్వామీ మీకో విషయం చెప్పవచ్చా " అని అడిగి ఇలా అంటాడు:

" ఇంద్రియాణి మనః ప్రాణ
  ఆత్మ ధర్మో ధృతిః
  హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం
  యస్య నశ్యన్తి జన్మనా "
          - భాగవతం 7:10:8

" ఓ ప్రభూ, ఒక వ్యక్తికి పుట్టుక ప్రారంభం నుండే ఉన్న కామ కోరికల కారణంగా, అతని ఇంద్రియాలు, మనస్సు, జీవితం, శరీరం, మతం, ఓర్పు, తెలివి, సిగ్గు, ఐశ్వర్యం, బలం, జ్ఞాపకశక్తి మరియు సత్యసంధత అన్నీ నశించిపోతాయి "  అని.

కోరిక అనేది చాలా చెడ్డది. ఒకటి కావాలనిపిస్తుంది. దానిని స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. అది తనకే స్వంతం కావాలనిపిస్తుంది. ఇంకొకరికి ద్రక్కకూడదనిపిస్తుంది. తనకి ద్రక్కకపొతే కోపం/క్రోధం వస్తుంది. ఈ క్రోధం కామానికి తమ్ముడు. ఈరెండూ హృదయంలో తిష్ఠవేసుకుని కూర్చుంటాయి.

అగ్నికి " అనలం " అని ఒక పేరు. " అలం " అంటే చాలు అని అర్ధం. అనలం అంటే చాలు అనేది లేనిది అని. అగ్నిలో ఎన్నివేసినా మసి అయిపోతూనే ఉంటుంది కాని " ఇంక చాలు " అని అనదు. 

కోరిక కూడా అగ్ని వంటిదే. ఎన్నికోరికలు తీరుతూన్నా కొత్తవి పుట్టుకువస్తూనే ఉంటాయి.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే మనలోని కోరికలను తగ్గిస్తారు, జీవితం ఆనందదాయకం అవుతుంది.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ