కోరికలు తప్పు కాదు కాని కోరిక ధర్మబద్ధంగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" ధూమేనావ్రియతే వహ్నిః, 

  యధా దర్శో మలేనచ, 

  యధోల్బేనావృతో గర్భః, 

  తధా తేనేదమావృతం " 

             - భ.గీత 3:38

" పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే కప్పివేయబడును " అన్నారు పరమాత్మ.

ఇక్కడ కామము అంటే కోరిక. దీనికి అంతులేదు. ఒకటి తరువాత ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది. ఎలాగయినా తీర్చుకోవాలనుకున్నప్పుడు కోపం ద్వేషం అహం పెరుగుతాయి.

ధర్మరాజుది ఎంతటి అద్భుత వ్యక్తిత్వమో చూద్దాం.

12 ఏళ్ల అరణ్యవాసానికి వెడుతూన్నప్పుడు ద్రౌపది " ఎప్పుడూ ధర్మం ధర్మం అంటారు. ధర్మంని అనుసరిస్తూన్న మీరు అరణ్యం పాలయ్యారు. అధర్మం చేస్తూన్నవాడు రాజ్యం ఏలుతున్నాడు " అని అంటే అప్పుడు ధర్మజుడు " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ - ధర్మం నా స్వభావం మరి ( ఏమి చెయ్యమంటావు )" అంటారు.

అంతటి అమితధర్మపరుడు, అజాతశత్రువు ధర్మజుడు. రాజసూయ యాగం చేసాడు,  కృతజ్ఞతగా శ్రీకృష్ణుడిని గౌరవించుకున్నాడు, ఆ సభలోనే శిశుపాలుడిని సంహరించారు స్వామి. 

అన్ని అద్భుతవిషయాలను చూసిన ఆయన " పాచికలాడుదాం రా "  అని దుర్యోధనుడు పిలుస్తే వెళ్ళారు. సరే. పిలిచినది ఎవరు, ఆడువలసినది ఎవరు. " నాబదులు శకుని ఆడుతాడు " అని దుర్యోధనుడు అంటే సరే అన్నాడు. రాజ్యాన్ని, తనని, తన సోదరులని కూడా ఓడాడు. ఆఖరికి ఆశ్చర్యకరంగా భార్యని పందెంగా పెట్టి ఓడాడు. ఇదంతా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కాని ఆశ్చర్యపడక్కరలేదు.

అదే స్వామి చెప్పినది " జ్ఞానమును కామము ( నెగ్గాలనే కోరిక, నెగ్గితీరుతామనే అహం ) కప్పేస్తుంది " అని. 

ధర్మరాజు పరిస్థితే అలాగుంటే పిపీలకముల( చీమల)పాటి  చెయ్యని సామాన్య జీవుల పరిస్థితి ఏమిటి. 

హిరణ్యకశిపుడిని సంహరించాక నృసింహస్వామి " ఏదయినా వరం కోరుకో " అంటారు ప్రహ్లాదుడితో. ప్రహ్లాదుడు " యా ప్రీతిరవివేకానాం విషేశ్వరపాయిని " - " అవివేకులకు అవసరంలేని విషయాలపై ఎంతప్రీతి ఉంటుందో నీమీద నాకు అంతప్రీతి ఉండేలా అనుగ్రహించు స్వామీ " అని కోరుకుంటాడు. ఎంత అద్భుతమయిన కోరిక, పోలిక.

కోరిక లేకపోతే జీవితం నిస్సారం. మన కోరికలు ధర్మబద్ధంగా, సమంజసంగా, ఆరోగ్యకరంగా ఉండేలా అనుగ్రహించమని పరమాత్మని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ