కోరికలు ఎప్పటికీ ఇక చాలు అనిపించవు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు " 🙏
" అధ కేన ప్రయుక్తో2యం
పాపం చరతి పూరుషః,
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ
బలాదివ నియోజితః "
- భ.గీత 3:36
పరమాత్మని అర్జునుడు అడుగుతాడు " తప్పని తెలిసీ చెయ్యకూడదని తెలిసీ ఎందుకు జీవుడు తప్పుడు/పాపపు పనులు చేస్తూనే ఉంటాడు " అని. ఇది అందరికీ సాధారణంగా కలిగే సందేహమే.
పరమాత్మ అంటారు " ఇది ఇప్పటిది కాదు, జన్మజన్మలనుంచి పేరుకుపోయిన సంస్కారం/వాసనలు. కామం/కోరిక కు ' చాలు ' అనేది ఉండదు. పేరుకుపోతూనే ఉంటుంది " అని.
ఈ కోరిక అనేది చాలా చెడ్డది. ఒకటి కావాలనిపిస్తుంది. దానిని స్వంతం చేసుకోవాలనిపిస్తుంది. అది తనకే స్వంతం కావాలనిపిస్తుంది. ఇంకొకరికి ద్రక్కకూడదనిపిస్తుంది. తనకి ద్రక్కకపొతే కోపం/క్రోధం వస్తుంది. ఈ క్రోధం కామానికి తమ్ముడు. ఈరెండూ హృదయంలో తిష్ఠవేసుకుని కూర్చుంటాయి.
అగ్నికి " అనలం " అని ఒక పేరు. " అలం " అంటే చాలు అని అర్ధం. అనలం అంటే చాలు అనేది లేనిది అని. అగ్నిలో ఎన్నివేసినా మసి అయిపోతూనే ఉంటుంది కాని " ఇంక చాలు " అని అనదు.
కోరిక కూడా అగ్ని వంటిదే. ఎన్నికోరికలు తీరుతూన్నా కొత్తవి పుట్టుకువస్తూనే ఉంటాయి.
అద్దాన్ని మురికి, నిప్పుని పొగ కప్పేసినట్లుగా ఈ కోరిక జీవుడి జ్ఞానాన్ని కప్పేస్తుంది.
ఎన్నో వింతలు చూస్తూంటాం. 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిఉండి ఇంకా కక్కూర్తిపనులు ఎందుకూ అనిపిస్తుంది. ఈ వయస్సులో ఇలాంటిపని అవసరమా అనిపిస్తూంటుంది. కాని గతజన్మ వాసనలు చాలా బలంగా ఉంటాయి.
కాని ఏమీ భయపడక్కరలేదు అన్నారు స్వామి. పెద్ద గడ్డిమోపు ఉంటుంది, ఓ చిన్ననిప్పురవ్వ చాలు మొత్తం దానిని మసి చేసేయడానికి. అలాగ వాసనలన్నింటినీ కొద్దిగా జ్ఞానం చాలు కాల్చిపారేయడానికి.
జీవుడి పనులే వాని ధోరణిని, ధోరణే అతని అలవాటుని, అలవాటే అతని నడవడికని, నడవడికే అతని గమ్యాన్ని నిర్ణయిస్తాయి. అంటే జీవుడి జీవితగమ్యాన్ని నిర్ణయించేది అతని పనులే.
అందుకని కోరికలను కోపాన్ని కొద్దిగా అదుపులో పెట్టుకుని వీలయినంతగా మంచిపనులు చేస్తూంటే పాపాలు/వాసనలు కాలిపోవడం, జీవితానికి ఓ అర్ధం పరమార్ధం ఏర్పడడం తధ్యం అని స్వామి తెలియచేసారు.
" తన్మే మనః శివసంకల్పమస్తు ( సంకల్పసూక్తం )" - అందరి మనస్సుల్లోనూ శుభసంకల్పాలనే కలిగిస్తూ, ఎల్లప్పుడూ మంచిపనులే చేసేలా అనుగ్రహించమని పరమాత్మని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment