ధైర్యం అంటే వైరాగ్యం - అనుబంధం తగ్గించుకోవడం - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" అసంశయం మహాబాహో
మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌంతేయ
వైరాగ్యేణ చ గృహ్యతే "
- భ.గీత 6:35
అర్జునుడు అంటాడు " మనస్సును నిగ్రహించడం అంత సులువుకాదు కదా " అని. అప్పుడు పరమాత్మ అంటారు " కష్టమే కాని అభ్యాసంతోనూ మరియు వైరాగ్యంతోనూ నిగ్రహించుకోవడం సులభమే " అని.
ఇక్కడ స్వామి " వైరాగ్యేణ చ " అన్నారు. చ అంటే మరియు అంటే వైరాగ్యం కూడా అవసరం అన్నారు.
ఒక స్వామిని " ధైర్యం " అంటే ఏమిటి అని అడిగితే " వైరాగ్యం " అన్నారు.
ధైర్యం అనేది మానసికం. అది వ్యాయామాలు కసరత్తులు చేస్తే వచ్చేదికాదు. వైరాగ్యం వల్లే వస్తుంది. ఏది జరిగినా మనమంచికే అనుకుంటూ అన్నీ పరమాత్మ ప్రసాదాలే/అనుగ్రహాలే అనుకుంటే అంతా సచ్చిదానందమే.
గరికిపాటివారు పూజ్యులు శ్రీమల్లాది చంద్రశేఖరశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తూ ఓ అద్భుతవిషయం తెలియచేసారు. పుట్టపర్తిసంస్థానం వారు శాస్త్రిగారికి స్వర్ణపుష్పాభిషేకం చేయ సంకల్పించి ఆహ్వానం పంపారుట. ఈయన అప్పటికే ప్రవచనాలూ అవీ మానేశారు. " నేను రాలేను " అని తెలియచేసారుట. వారికి ఆశ్చర్యం వేసింది. ఓ పెద్దాయన్ని పంపించారు ఒప్పించడానికి. ఈయన రాలేనన్నారు. అప్పుడు ఓ రాజకీయనాయకుడిని ( ఈయన తరువాత టిటిడి చైర్మన్ గా చేసారు ) పంపించారు. ఆయన " గురువుగారు మిమ్మల్ని కారులో విమానాశ్రయానికి తీసుకువెళ్ళి అక్కడనుంచి హెలికాప్టర్లో పుట్టపర్తికి తీసుకువెళ్ళి తీసుకువస్తాం. 3,4 గం.లలో మిమ్మల్ని మళ్ళీ మీ ఇంట్లో దింపేస్తాం " అని చెప్పగా అప్పుడు ఆయన అసలు విషయం " శృంగేరీ, కంచిపీఠాలలో తప్ప ఇతర సన్మానాలు నాకు ఇష్టం లేదు " అని చెప్పారు(ట).
పరమాత్మ అనుగ్రహంలేనిదే అంతటి " వైరాగ్యం " అభ్యాసంలోకి రావడం కష్టం. అదృష్టవంతులు.
పరమాత్మని ఇప్పటికైనా మనందరికీ కూడా అహం ( ఉన్నవారికి ) పోగొట్టి అటువంటి " వైరాగ్య స్థితి " కలిగించమని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment