అమ్మవారు పది రూపాయలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చి మాయ చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" తాం మ ఆవహ జాతవేదో
లక్ష్మీమనపగామినీం " - శ్రీసూక్తం.
ఇక్కడ " లక్ష్మీమనపగామినీం " అని ప్రార్ధిస్తాం. " అనపగామినీం " అంటే తిరిగి వెనక్కు వెళ్ళనటువంటిది. అటువంటి సంపదను ఇయ్యమని అమ్మవారిని కోరుకోవాలి.
" ధనమగ్ని ర్ధనంవాయుః
ధనంసూర్యో ధనంవసుః
ధనమింద్రో బృహస్పతిః
వరుణం ధనమశ్నుతే "
అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్యుడు, అష్టవసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు తమతమ సంపదలను నీ కృపతో అనుభవిస్తున్నారు తల్లీ. ఎంత అద్భుతం అమ్మవారి ఐశ్వర్యం.
ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు " ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములతో జీవించుము " అని అంటారు. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యములంటే తెలిసినవే. భోగాలంటే సౌకర్యాలూ, పనిమనుషులు మొ.గునవి. మరి భాగ్యం ఏమిటి. ముందర నాలుగూ అంటే " ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం భోగాలు " ఉన్నా సుఖం ఉండదు చాలామందికి.
" అశాంతస్య కుతః సుఖం " - ఎప్పుడూ " అశాంతిగా ఉండేవానికి సుఖం ఎక్కడిది ( భ.గీత 2:66 )" అన్నారు పరమాత్మ గీతలో.
" భాగ్యం " అంటే ఈ శాంతే. ఇది ఉన్న మనిషే సుఖంగా ఉండగలడు, ఏది లేకపోయినా.
ఈ శాంతిని కలుగచేసేది అమ్మవారు లక్ష్మీదేవి. ఆవిడ సంపదని ఇస్తుంది అంటారు. నిజమయిన సంపద ఈ శాంతే.
శ్రీలక్ష్మీ సహస్రనామాల్లో " సదదృష్టప్రదాయినీ/దురదృష్టవిఘాతినీ " అని చదువుతాం. మంచి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది, దురదృష్టాన్ని పోగొడుతుంది అని.
వరలక్మీవ్రతం అత్యంత అద్భుతమైనది. పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగింది " గృహిణి ఒక్కరూ ఏ వ్రతం చేస్తే ఇటు పుట్టింటివారూ అటు మెట్టినింటివారూ కూడా సకలసౌభాగ్యాలతో వర్ధిల్లుతారూ " అని. స్వామి " వరలక్ష్మీవ్రతం " చెయ్యాలని చెప్పారు. లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ తను ఏరూపంలో ఉంటానో చెబుతూ ఇంటిలో " గృహలక్ష్మి " గా ఉంటానని చెప్పింది. అందుకని ఇంటి ఇల్లాలు ఈ వ్రతం చేసి ఇంకో ఇంటి ఇల్లాలికి వాయనం ఇస్తే లక్ష్మీదేవి పరమప్రసన్నురాలవుతుంది, అనుగ్రహిస్తుంది. సంశయం నాస్తి.
కాని కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. అమ్మవారు మనం కోరుకున్నదాని కన్నా ఎక్కువ ఇచ్చి మాయ చేస్తుంది. తట్టుకోవడం కష్టం, బురదలో కూరుకుపోతాం. జాగ్రత్తగా ఉండాలి.
ఈరోజు పరమపవిత్రమయిన శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు. జీవితాన్ని సుఖమయం చేసే " భాగ్యము " ను అందరికీ ప్రసాదించమని అమ్మవారిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీవరలక్ష్మీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment