పని చెయ్యడం వరకే, ఫలితం గురించి ఆలోచించనక్కరలేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కర్మణ్యేవాధికారస్తే
మా ఫలేషు కదాచన,
మా కర్మఫలహేతుర్భూః
మా తే సంగోఽస్త్వకర్మణి "
- భ.గీత 2:47
" పనిమీదే నీకు అధికారం, ఫలితంమీద కాదు. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం మీద దృష్టి పెట్టకు " అన్నారు పరమాత్మ.
దీనికి ఒక కారణం అనుకున్న ఫలితం రాకపోతే బాధపడవలసి వస్తుంది అని. కాని ఇంకో అద్భుతమయిన కారణం కూడా ఉంది. ఫలితం గురించే ఆలోచిస్తూ పనిచేస్తే పనిలో శ్రద్ధ, నాణ్యత తగ్గుతుంది. ఉదా: ఓ చక్కటి ఆనకట్ట కడితే 50 వేలు లాభం వస్తుంది అనుకుందాం. శ్రద్ధగా నాణ్యతతో పనిచేస్తే ఆ లాభం ఎలాగూ వస్తుంది. కాని 50 వేలమీదనే దృష్టి పెడితే సులభంగా తొందరగా ఆ మొత్తం ఎలా పొందవచ్చో ఆలోచించడం మొదలెడతాడు. అవినీతి పెరుగుతుంది, నాణ్యత తగ్గుతుంది. ఇప్పుడు అదే జరుగుతూంది ఎక్కువగా. ఎంత అద్భుతమయిన సత్యం చెప్పారు పరమాత్మ.
అదే పనిమీద, నాణ్యతమీద దృష్టి పెడితే క్రొత్త ఆలోచనలు వస్తాయి, క్రొత్త పద్దతులు తెలిసి లాభం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. పని అద్భుతంగా జరగడంతో మంచిపేరు కూడా వస్తుంది చేసినాయనకు.
సుందరకాండలో హనుమ ఇలా అంటారు:
" కార్యే కర్మణి నిర్ధిష్టే
యో బహూన్యపి సాధయేత్,
పూర్వకార్యాదిరోధేన
సకార్యం కర్తృమర్హసి "
" చెప్పినపనే కాకుండా తన ప్రభువుకు పనికివచ్చే ఇతర పనులను కూడా, అసలు పనిని వదిలేయకుండా, చేసుకుని వచ్చేవాడు ఉత్తమ సాధకుడు " అని.
లంకలో సీతమ్మను చూసి మాట్లాడిన వెంటనే హనుమ తిరిగి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే హనుమ ఉత్తమసాధకుడు " రామదూత " ఎలా అవుతారు. రాముని కార్యం సులభం చేయడానికని లంకలోని ఏర్పాట్లు, బలగాల గురించి తెలుసుకోవడమే కాకుండా, చాలా మంది వీరులను సంహరించి, రావణుడిని కూడా కలిసి మాట్లాడి వెళ్ళారు హనుమ. పనిమీద శ్రద్ధ పెడితే అటువంటి క్రొత్త మార్గాలు కనిపిస్తాయి, ప్రభువునుంచి ఆశించిన దానికంటే ఎక్కువ అభినందన లభిస్తుంది. హనుమ అలా చేయడంవలననే " రామదూత " అనగానే ఎవరికయినా హనుమ గుర్తుకొస్తారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment