నేడు వరాహ జయంతి - మన భూమిని రక్షించిన స్వామి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏

" నేడు వరాహ జయంతి "

బ్రహ్మగారి మనస్సునుంచి సృష్టికోసం సనకసనందనాదులు, నారదమహర్షి వంటివారు పుట్టుకొచ్చారు కాని వారు నివృత్తి మార్గంని అనుసరించడంతో మళ్ళీ సృష్టి కోసమని ప్రజాపతులు, మహర్షులు ఉద్భవించారు. వారి వలన సత్యతపోలోకాలు వంటి ఊర్ధ్వలోకాలు దేవతలు మొ.గు వారితో నిండి ఉన్నాయి.

ఇక భూలోకంలో కూడా సృష్టి మొదలు పెట్టడానికి శ్రీకారం చుట్టారు బ్రహ్మ. ఆయన ధ్యానంలో ఉండగా ఆయన నుంచి శతరూప స్వయంభు మనువులు ఉద్భవించారు. వీరు ప్రధమ మిధునం ( జంట ). వీరిని సృష్టి మొదలు పెట్టండి అంటే " ఎక్కడ " అని అడిగారు. భూమిమీద అన్నారు బ్రహ్మ. భూమి ఎక్కడుంది అని అడిగారు వారు. 

భూమి లేదు అక్కడ. హిరణ్యాక్షుడు భూమిని తీసుకుని నీటిలోపలికి వెళ్ళి పోయాడు.

ఇక్కడ పూజ్యులు సామవేదంవారు ఓ అద్భుత విషయం తెలియచేసారు. హిరణ్యాక్షుడు ఒక శాస్త్రజ్ఞుడు. భూమిని ఎత్తుకు పోయాడు అంటే భూమిని తన నిర్ణీతకక్ష్యనుంచి తప్పించాడు అని తెలుసుకోవాలి అన్నారు. అది అసురలక్షణం, ప్రకృతి విరుద్ధం, సృష్టిని అడ్డుకోవడానికి చేసిన పని.

భూమి రక్షణకోసం బ్రహ్మ ధ్యానంలో కూర్చున్నారు. ఆయన నాశికలోనుంచి బ్రొటకనవ్రేలు పరిమాణంతో వరాహస్వామి అవతరించారు. క్షణాలలో ఏనుగంత అయి 

గర్ఘరధ్వని చేసారు. వరాహగర్జనని గర్ఘరం అంటారు. బ్రహ్మ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వరాహమూర్తి బ్రహ్మ వలన రాలేదు, బ్రహ్మ లోంచి వచ్చారు ఆయనకు తెలియకుండా. తను ధ్యానం చేసిన యజ్ఞభగవానుడే ఈయనా అని ఆశ్చర్యపోయారు బ్రహ్మ. యజ్ఞభగవానుడి రూపం కనుక యజ్ఞవరాహమూర్తిగా పూజింపబడుతున్నారు స్వామి. దేవతలు ఋషులు అందరూ సత్యలోకానికి వచ్చి స్వామిని ఆశ్చర్యంగా చూస్తున్నారుట. స్వామి అలా అలా పెరిగి పోయారు.

స్వామి భయంకరమైన కోరలతో ఉగ్రంగా ఉన్నా ఎంతో ప్రసన్నంగా చూస్తున్నారుట అక్కడి వారినందరినీ.

వరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించి భూమిని రక్షించారు ( నిర్ణీత కక్ష్యలో ఉంచారు మళ్ళీ ). స్వామి ఆకారాన్ని ఊహించాలంటే ఒక విషయం ఉంది. 

జయదేవుడు దశావతార స్తుతిలో వరాహస్వామిని ఇలా ప్రార్థిస్తారు:

" వసతి దశన-శిఖరే ధరణీ తవ 

  లగ్నా శశినీ కలంక-కలేవ నిమగ్నా,

  కేశవ ధృత-శూకర-రూప

  జయ జగదీశ హరే "

" వరాహ అవతారం ఎత్తిన ఓ కేశవా, నీ కోరలమీద ఉన్న భూగోళం మచ్చలున్న చంద్రుడిలా ఉంది " అని. మనం పౌర్ణమి నాడు చూసే చంద్రబింబంలా, చిన్న బొమ్మలా ఉందిట భూమి. 

మనకు ఏది కావాలన్నా భూమి ఇస్తూంది, భూమే ఇవ్వాలి. అటువంటి తల్లిని కాపాడినవారు యజ్ఞవరాహస్వామి. ఆ స్వామిని భక్తితో సేవించుకుని తరిద్దాం.

మనం ఇప్పుడు ఉన్నది శ్వేత వరాహ కల్పంలో. స్వామిని అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.

ఈరోజు వరాహ జయంతి. శుభాకాంక్షలు.

ఏతత్ సర్వం శ్రీ వరాహమూర్త్యార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ