ఓం ఒకటే అక్షరం - అదే ప్రపంచశాంతికి మార్గదర్శి - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ
వ్యాహరన్మామనుస్మరన్,
యః ప్రయాతి త్వజన్దేహం
స యాతి పరమాం గతిమ్ "
- భ.గీత 8-13
" ఈ యోగవిధానమునందు నెలకొని దివ్యాక్షరముల సమాహారమైన ఓంకారమును జపించిన పిదప మనుజుడు దేవదేవుడనైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మికలోకములను పొందగలడు " అన్నారు పరమాత్మ అర్జునుడితో.
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ( ఓం ఇతి ఏక అక్షరం ) అన్నారు పరమాత్మ. ఓం అనే ఒక అక్షరమే బ్రహ్మ/పరమాత్మ/చైతన్యం. ఈ సృష్టి అంతా ఓం అనే ఒక అక్షరం నుంచే వచ్చింది. ఓం ను జపించి తరించమన్నారు పరమాత్మ.
సనాతనం ఏమి చెబుతూందంటే ఓం నుంచి నమః శివాయ అనే పంచాక్షరి పుట్టింది, దానినుంచి సృష్టి మొదలయ్యింది. ప్రళయకాలంలో జగత్తంతా నమశ్శివాయలోనూ, నమశ్శివాయ ఓం లోనూ లయమవుతుంది. మళ్ళీ సృష్టి మొదలవుతుంది.
అక్షరం అంటే నాశనంలేనిది అని. ఎంత అద్భుతమైన పేరుపెట్టారు అక్షరం అని. మంత్రపుష్పంలో " ఈశానాం సర్వవిద్యానాం " అంటాం. సర్వవిద్యలకు అంటే అన్ని అక్షరాలకు అధిపతి పరమాత్మ. అందుకే పిల్లలకి అక్షరాభ్యాసం చేసినప్పుడు ముందర " ఓం నమశ్శివాయ " వ్రాయిస్తారు.
కొందరు అమ్మవారిని, కొందరు శివుడిని, నారాయణుడిని, కుమారస్వామిని, సూర్యుడిని లేక ఇంకొకరిని పూజిస్తారు. ఎవరు ఎవరిని పూజించినా వారిదేవుడి పేరు ముందర ఓం ఉండితీరుతుంది. భక్తులలో కొందరికి ఒకరంటే ఒకరికి పడకపోయినా ఓం తప్పదు. ఎంత అద్భుత అక్షరం.
ఓం యొక్క గొప్పదనం ఇప్పుడిప్పుడే ప్రపంచమంతా తెలుస్తూంది. ఆసుపత్రులలో కూడా రోజుకు వీలయినన్ని సార్లు ఓం జపం చేయిస్తున్నారు. అలా జపిస్తే ఏఏ రోగాలు నయమవుతాయో కూడా తెలుసుకుంటున్నారు/తెలియచేస్తున్నారు. ఓం ను ఉచ్ఛరించడంవలన ప్రాణవాయువు శాతం పెరుగుతుందని లాక్టిక్ యాసిడ్ విడుదలయి అలసట తగ్గుతుందని శాస్త్రీయంగా నిరూపిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా ఎన్ని అద్భుతాలు బయటపడబోతున్నాయో ఓం గురించి.
తొందరలో మిగతా మతాలవారుకూడా ఓం ను జపించడం ప్రారంభించినా ఆశ్చర్యపడక్కరలేదు. అది ఓం అక్షరం గొప్పదనం.
" నాన్యః పంథా అయనాయ విద్యతే " - పురుషసూక్తం. వేరే దారిలేదు ఇతరులకు కూడా, మన సనాతనధర్మమే దిక్కు.
మన సనాతనధర్మానికి సాటిలేదు, రాదు కూడా. ప్రపంచశాంతికి, అందరి సుఖమయజీవితానికి ఏకైక పరిష్కారం " భారతీయ సనాతనధర్మం ".
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment