జన్మ ఏదయినా ధ్యాస అమ్మవారి పాదాలపై ఉంటే నష్టం లేదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" జ్ఞానదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 643 వ నామం .
" జ్ఞానదా " అంటే జ్ఞానమును ఇచ్చునది, అజ్ఞానాన్ని నశింపచేయునది అని అర్ధం.
మోక్షమును ఇచ్చే జ్ఞానాన్ని ఇస్తుంది. జీవుని బంధించు లోకజ్ఞానాన్ని నశింపచేస్తుంది. మోక్షం కన్నా బంధాలు పెంచే లోకజ్ఞానం నశించడమే ముఖ్యం.
శంకరులు శివానందలహరి చేస్తూ ఓ అద్భుత విషయం తెలియచేసారు:
" నరత్వం దేవత్వం నగవన
మృగత్వం మశకతా,
పశుత్వం కీటత్వం భవతు
విహగత్వాదిజననం,
సదా తత్పాదాబ్జస్మరణ
పరమానందలహరీ, విహారాసక్తం చేత్
హృదయమిహ కిం తేన వపుషాం " -10
" మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని.
కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడితేనే స్వామిని తమ తలపై పెట్టుకుని సేవించుకుని చరితార్ధులవుతున్నాయి.
కొన్ని అడవులు ఉంటాయి - శబరిమల, నల్లమల (శ్రీశైలం) మొ.గునవి. స్వామిని తమమధ్యలో ఉంచుకుని తరిస్తున్నాయి.
దోమపుట్టుక గురించి చెబుతూ హాస్యంగా " కొన్ని దోమలు అందరి రక్తమూ త్రాగవు, దేవుడి భక్తుల రక్తమే త్రాగుతూ తరిస్తాయి " అన్నారు గరికిపాటివారు.
అలాగే జంతువులలో కొన్ని ఏనుగులు, పశువులు దేవుడిసేవలో తరిస్తాయి.
కొన్ని పక్షులు దేవుడిగుడి గోపురాలమీద నివసిస్తూ సుప్రభాతాలూ స్తోత్రాలూ వింటూ, ప్రసాదాలు తింటూ తరిస్తాయి.
అలా సదా అమ్మవారి ధ్యాసలో గడపగలిగినప్పుడు ఏ జన్మ అయినా లేక ఇంకో జన్మ తీసుకోవలసి వచ్చినా నష్టం ఏముంటుంది. అటువంటి భాగ్యం/జ్ఞానం కలిగించమని కోరుకుంటూ అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
🙏🙏🙏
ReplyDelete