మనస్సులో కూడా ఇంకొకరి కీడు తలచకూడదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
" శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్ఠితాత్,
స్వభావనియతం కర్మ
కుర్వన్నాప్నోతి కిల్బిషం "
- భ.గీత 18:47
" బాగుగా ఆచరించబడిన పరధర్మంకంటే గుణరహితమైననూ స్వధర్మాచరణమే మంచిది/శ్రేష్ఠమయినది. స్వధర్మరూప వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యులకు ఎట్టిపాపములును ఏమాత్రమూ అంటవు ".
స్వధర్మమే ఉత్తమమని చెప్పారు పరమాత్మ.
వైద్యుడు అత్యవసరమయితే, ప్రాణానికే ముప్పు అయినప్పుడు కాలో చెయ్యో తొలగిస్తాడు. అంతేకాని " అయ్యోపాపం " అని ఊరుకోడు. అది వృత్తిధర్మం.
ఒక విషయం చూద్దాం. ఒకాయన మాంసంకొట్టు నిర్వహిస్తున్నాడు. ఎన్నో దశాబ్దాలుగా ఆయన కుటుంబీకులు దానిని నిర్వహిస్తున్నారు. స్వామి చెప్పినది " అదేమీ జీవహింస క్రిందకూరాదు, అతనికి పాపమూ అంటదు " అని.
ఆ కొట్టుముందర బ్రతికున్న ప్రాణులను వ్రేలాడదీసి ఉంచుతాడు. ఒకాయన వచ్చి ఓ ప్రాణిని చూపిస్తాడు.
కొందరికి అనిపిస్తుంది " అలా వాటిని వ్రేలాడదీయడమేమిటి, ఒకతను వచ్చి దానిని కొనడమేమిటి, కొట్టతను దానిని చంపి ఇవ్వడమేమిటి " అని. కొందరు సున్నితమనస్కులకి వెగటుగా కూడా అనిపించి " అయ్యో పాపం " అని బాధపడతారు కూడా.
ఇక్కడ ఒక ముఖ్యవిషయం గమనించాలి. అసలు ఆ జీవికి అంత భయంకరమైన మరణం ఎలా సంభవిస్తూంది అని.
" ప్రారబ్దం భోగతో నశ్యేత్ " అని చెబుతూంది శాస్త్రం. ఏ పుణ్యమయినా పాపమయినా అనుభవిస్తేనే తరుగుతుంది అని. మరి అంత భయంకర మరణం పొందుతూందంటే ఆ జీవికి ఎంత పాపం చేసి/ప్రోగుపడి ఉండాలి. ఆ పాపఫలితమే ఇప్పుడు ఈరకంగా అనుభవిస్తూంది అని అనుకుంటే జాలివేస్తుంది కాని ఎలాంటి వికారమూ కలగదు. ఎవరినైనా, ఎప్పుడయినా స్వలాభంకోసం చంపాలనుకున్నప్పుడు ఈ జీవి జ్ఞాపకానికి వచ్చి జాగ్రత్తపడే అవకాశం ఉంది, అది అంత సులభం కాకపోయినా.
అందుకే మనస్సులో కూడా ఎవరికీ హాని తలపెట్టకూడదు అని తెలియచేస్తూంది సనాతనధర్మం.
ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment