భగవంతుడిమీద నమ్మకం ఉన్నవారు ఇంకదేనికి బాధపడరు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" యం లబ్ధ్వా చాపరం లాభం
మన్యతే నాధికం తతః,
యస్మిన్ స్థితో న దుఃఖేన
గురుణాపి విచాల్యతే "
- భ.గీత 6:22
" పరమాత్మప్రాప్తిరూప లాభమును పొందినవాడు ( అనగా భగవత్సాక్షాత్కారమును పొందినవాడు) మఱేయితర లాభమునుగూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవస్థితిలోనున్న యోగిని ఎట్టి బలవద్దుఃఖములును చలింపజేయజాలవు " అన్నారు పరమాత్మ.
భక్త రామదాసు ప్రజలు కట్టిన పన్నులను ప్రభుత్వానికి కట్టకుండా ఆ డబ్బుతో రాములవారికి గుడి కట్టించాడు, నగలు చేయించాడు. జైలులో పెట్టించినా, శిక్షించినా తొందరగా వచ్చి రక్షించమని రాముడినే వేడుకున్నాడు కాని రాజును వేడుకోలేదు.
పోతనామాత్యుడిని భాగవతాన్ని ఎవరికయినా ఓ రాజుకి అంకితమిస్తే కావలసినంత ధనం ఇచ్చి సత్కరిస్తారని ఎందరో నచ్చచెప్పాలని చూసారు. పోతన ససేమిరా అన్నారు. రాములవారికి అంకితమిచ్చారు, నా బాగోగులు ఆయనే చూసుకుంటారు అని నమ్మారు.
త్యాగయ్యని అన్నగారు కూడా " ఈ పాటలు కూడు పెట్టవు, ఏ రాజుని పొగుడుతూ పాడినా కోరినంత ధనం ఇస్తారు " అని నచ్చచెప్పడానికి ప్రయత్నంచేసాడు. అంతకన్నా పది ఇళ్ళలో బిక్షం ఎత్తుకోవడం నయం అన్నారు త్యాగయ్య, అలాగే చేసారు కూడా.
వందల సంవత్సరాలు అయిపోయినా వీరినందరినీ గుర్తుంచుకుని గౌరవిస్తున్నాం. అటువంటి శాశ్వతమైన కీర్తిని పొందుతారు అశాశ్వతమైన వాటిని దూరంగా పెడితే.
వీరెవరూ కూడా కష్టాలకు వెరవలేదు. పరమాత్మ అనుగ్రహానికి మించిన సంపద లేదని నమ్మినవారు వీరు. అదే బ్రహ్మానందస్థితి. ఆ స్థితిలో బాహ్యసుఖాలు, సంపదలు తృణప్రాయం సాధకులకు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment