శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. - చీమలపాటి సూర్యనారాయణ
🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏
శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణపరమాత్మ జయంతి. పరమ పవిత్రమయిన రోజు. శుభాకాంక్షలు.
" అనన్యాశ్చింతయంతో
మాం ఏజనాః పర్యుపాసతే,
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహం "
- భ.గీత 9:22
పరమాత్మ " ఇతరవిషయాలగురించి ఆలోచన చెయ్యకుండా నన్నే ఎవరు సేవిస్తారో వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను " అన్నారు.
పాండవులను అలాగే ఆదుకున్నారు స్వామి. ఆఖరికి రాయబారానికి కూడా స్వయంగా వెళ్ళారు.
పూజ్యులు గరికిపాటివారు ప్రవచనంచేస్తూ ఓ అద్భుతమయిన విషయం చెప్పారు ( వ్యాసభారతంలో ఉన్న విషయం ఇది ). ఆయనకు, విన్నవారికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. పరమాత్మ రధం నడుపుతున్నారు కురుక్షేత్రంలో. అర్జునుడు రధంలో నుంచుని యుద్ధం చేస్తున్నాడు. ఒకరిని కొట్టడమో, నిరాయుధుడిని చేయడమో అయిన తరువాత రధాన్ని తిన్నగా పోనివ్వాలా, ఎడమకు తిప్పాలా, కుడికి పోనివ్వాలా ఎలా తెలుస్తుంది సారధికి. పరమాత్మ సారధి, కూర్చుని ఉన్నారు, ఎక్కువదూరం కనబడదు. అర్జునుడు నుంచుని ఉన్నాడు, దూరంగా చూడగలడు, ఎటువెడితే ఉపయోగమో తెలుసుకోగలడు. ఒక చేతిలో ధనుస్సు, రెండో చేతిలో బాణం. రణరంగంలో రణగొణధ్వనులు. ఇతను ఏమిచెప్పినా సారధికి వినబడనేవినబడదు. ఎటువేపు వెళ్ళాలో సారధికి చెప్పడానికి ఏమిచేస్తారో తెలుసా?. కుడివైపు తిప్పు అనడానికి కుడికాలిపాదంతో సారధి నడుము కుడివైపున తడతాడు. ఎడమవైపైతే ఎడమపాదంతో సారధి నడుము ఎడమవైపున తడతాడు. అలా అర్జునుడు తన పాదాలతో తట్టి సూచనలు ఇస్తూంటే పరమాత్మ తదనుగుణంగా సారధ్యం చేసారు. ఎంతటి కరుణ పరమాత్మకు. భక్తుడు కోసం అతని పాదస్పర్శకూడా అనుభవించాడు.
అంతటి అవ్యాజకరుణామూర్తి. భక్తుడి కోసం అన్నీ భరిస్తాడు.
కాని దీనిలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది.
" యే యథా మాం ప్రపద్యన్తే
తాంస్తథైవభజా మ్యహమ్"
- భ.గీత 4:11
" ఏవిధంగా సేవిస్తారో ఆవిధంగా అనుగ్రహిస్తాను " అన్నారు స్వామి.
ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో స్వామిని 2 కోరికలు కోరింది - 1. దుశ్శాశనుడి మనస్సుమార్చి సద్బుద్ధిని కలిగించు. లేదా 2. నన్ను ఈ అవమానం నుంచి రక్షించు.
స్వామి మొదటిది నేను చెయ్యలేనని రెండవది చేసారు. ఎందుకంటే " నాబుద్ధి మార్చు " అని అతను కోరుకుంటేనే స్వామి అనుగ్రహిస్తారు.
" తన్మే మనః శివసంకల్పమస్తు " - " మా మనస్సుల్లో మంచి సంకల్పాలే కలిగేలా అనుగ్రహించు " అని ఎవరికి వారే వేడుకోవాలి.
బాల్యమిత్రుడు కుచేలుడిని కూడా అతను స్వయంగా వచ్చాకే పైగా అతను తెచ్చిన అటుకులు తిన్న తరువాతే అనుగ్రహించారు పరమాత్మ.
సమాజ వికాసం, ప్రపంచశాంతి సాధనకోసం అద్భుతమైన భగవద్గీతను ప్రసాదించారు. " ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం " అని కొనియాడబడుతూంది ప్రపంచమంతా.
ఈరోజు పరమాత్మ పుట్టినరోజు. పరమపవిత్రమయిన శ్రీకృష్ణాష్టమి. అందరం " మామనస్సుల్లో శుభసంకల్పాలే కలిగేలా అనుగ్రహించు స్వామీ " అని వేడుకుందాం. ప్రపంచ శాంతిని పొందుదాం.
కృష్ణం వందే జగద్గురుం.
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
ఏతత్ సర్వం శ్రీకృష్ణపరమాత్మార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment