నేడు గోకులాష్టమి - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏 

నేడు పవిత్రమయిన గోకులాష్టమి.

కలి ప్రవేశం జరిగిన తరువాత నారదులు దేశాటన చేస్తూ ఓ ప్రదేశానికి వచ్చేసరికి ఓ వింత కనబడుతుంది. ఓ యువతి కూర్చుని ఏడుస్తూంది. ఆవిడ ముందర ఇద్దరు ముసలివారు కొన ఊపిరితో పడుక్కుని ఉన్నారు. వారు ఆ యువతి పిల్లలని తెలుసుకుని నారదులు ఆశ్చర్యపోతారు. అదే విషయం అడుగుతారు. అప్పుడు ఆ యువతి ఇలా చెబుతుంది. తనపేరు భక్తి. ముసలివారుగా కొన ఊపిరితో ఉన్న పిల్లలు జ్ఞాన వైరాగ్యాలు. ఈ భక్తికి ఓ దాసి ఉండేది. ఆవిడ పేరు ముక్తి.

ఈ నలుగురు కృష్ణపరమాత్మ పాదం భూమిమీద ఉన్నంతకాలం ఆడుతూ పాడుతూ హాయిగా గడిపారు. ఎప్పుడైతే పరమాత్మ భూమిమీద నుంచి తన పాదం తీసేసారో అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముసలివి అయిపోయాయి. ముక్తి " తన అవసరం ఇంక ఏముంది, మళ్ళీ మీరు బాగుపడి పిలిస్తే వస్తాను " అని చేప్పి ముక్తిపధం ( వైకుంఠం )కి వెళ్ళిపోయింది. భక్తి ఇద్దరు పిల్లలతో భూమి అంతా తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చేసరికి భక్తికి యవ్వనం వచ్చింది కాని పిల్లలలో మాత్రం మార్పులేదు. ఆ ప్రదేశం బృందావనం, కృష్ణుడు నడయాడిన ప్రదేశం. 

ఇక్కడో అద్భుత సత్యం ఉంది. భక్తితో బాగుపడి మళ్ళీ పిలుస్తే వస్తానంటుంది ముక్తి. అంటే భక్తి ఉన్నచోట ముక్తి ఉంటుంది. కేవలం భక్తితోనే ప్రహ్లాదుడు , ధృవుడు, త్యాగయ్య, పోతన వంటివారు జీవన్ముక్తులు అయారు.

అలా అని కలిని, కలి ప్రభావాన్ని తలచుకుంటూ బాధపడక్కరలేదు. కలి ఒక వరం జీవుడు ముక్తి పొందడానికి.

" యత్ఫలం నాస్తి తపసా 

  న యోగేన సమాధినా 

  తత్ఫలం లభతే సంయక్ 

  కలౌ కేశవకీర్తనాత్ "

ఇతర యుగాలలో తపస్సు యోగం సమాధితో ఏ ఫలాన్ని పొందుతారో ఆ ఫలాన్ని కలియుగంలో కేవలం కేశవనామ కీర్తనతోనే లభించేస్తుంది.

" ఋణాం జన్మ సహస్రేణ భక్తౌ ప్రీత్యర్హ్యి జాయతే " - అనేక జన్మల పుణ్యఫలం ప్రోగుపడి ఉంటేనే భక్తియందు ప్రీతి కలుగుతుంది అంటారు నారదులు.

భగవన్నామ స్మరణ చాలు. కాని అది కూడా అంత సులభమా. ప్రక్కకు లాగేస్తూంటాయి ఇంద్రియాలు.

భక్తిని కలిగించమని పరమాత్మని వేడుకుందాం.

ఈరోజు గోకులాష్టమి. కృష్ణుడు గోకులానికి చేరిన రోజు. శుభాకాంక్షలు. యధాశక్తి భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉందాం.

ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ