ప్రభావధర్మంని అలవాటుగా చేసుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" ధర్మిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 958 వ నామం .

" ధర్మిణీ " అంటే ధర్మమే స్వభావముగా గలది.

" యతో ధర్మాణి ధారయన్ " అని చెప్పింది వేదం. సృష్టి అంతా ధర్మం మీదే ఆధారపడి ఉంది. అమ్మవారికి ధర్మమే స్వభావము కనుకే ఇంత లయబద్ధంగా, ఆశ్చర్యగొలిపేలా, లోపరహితంగా ఉంటుంది ప్రపంచమంతా. ధర్మపాలన లేకపోతే సృష్టి నిలవదు.

" పరిత్రాణాయ సాధూనాం 

  వినాశాయచ దుష్కృతాం, 

  ధర్మ సంస్థాపనార్ధాయ 

  సంభవామి యుగే యుగే " 

                - భ.గీత 4:8

ధర్మసంస్థాపన కోసమే మళ్ళీమళ్ళీ వస్తూంటానన్నారు పరమాత్మ. " విశ్వధర్మములన్నిటికీ ఎవరు ఆధారమో ఆయనే పరమాత్మ " అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.

ధర్మం మూడు రకాలుగా ఉంటుంది.

మొదటిది స్వభావధర్మం. కొందరికి ఎవరూ చెప్పనక్కరలేదు. స్వతహాగానే ధర్మపాలన చేస్తూంటారు. రాముడు, ధర్మరాజు లాంటివారు ఆ కోవలోకి వస్తారు. రాముడిని ఒక రాక్షసుడు " రామో విగ్రహవాన్ ధర్మః " అని కొనియాడాడు. అంతటి ధర్మమూర్తి. " ధర్మ ఏవ మనః కృష్ణే స్వభావ " - " ధర్మంగా ఉండడం నా స్వభావం మరి, ఏమి చేయమంటావు " అంటారు ధర్మరాజు ద్రౌపదితో.

ఇక రెండవరకం " ప్రభావధర్మం " - చెప్పగా చెప్పగా సాధన చేస్తూ ఉంటే అలవడుతుంది. ఇదే ఈకాలంలో ఎక్కువగా పొందగలిగినది/పొందవలసినది. సనాతనధర్మ పరిరక్షణకోసం, సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యగా చెయ్యగా అలా మంచిచెయ్యడమే అలవాటుగా అయిపోతుంది. " అభ్యాసం కూసు విద్య " అన్నారు. చిన్నపిల్లలకు బాల్యంనుంచే ఇలా చెయ్యడం అలవాటు చేస్తే బాధ్యతగల పౌరులుగా తయారవుతారు.

ఇక మూడవది " అభావధర్మం " - ఇది దుర్మార్గులు, మూర్ఖులు చేసేది. వారుచేసే పనులు వారికి తప్ప ఎవరికీ ఏవిధంగానూ ఉపయోగపడవు. పైగా వీరిపనులు ఇతరులకు, సమాజానికి చేటు చేస్తాయి. ఇటువంటివారు ఈకాలంలో ఎక్కువగానే కనబడుతూంటారు.

ప్రభావధర్మంని అలవాటుగా చేసుకోవడం కష్టంకాదు కనుక ఆ మార్గంలో ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి అందరూ. ప్రపంచశాంతికి మార్గం సుగమం అవుతుంది.

" ధర్మో రక్షతి రక్షితః " - ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. 

అమ్మవారి పాదాలను ఆశ్రయించి ఎల్లవేళలా ధర్మమార్గంలోనే నడిచేలా అనుగ్రహించమని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Post a Comment

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ