" శ్రావణమాస వైశిష్ట్యం " - శుభాకాంక్షలు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" శ్రావణమాస వైశిష్ట్యం "
పవిత్రమయిన శ్రావణమాసం ఈరోజు ప్రారంభమయినది. శ్రవణం నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న మాసాన్ని శ్రావణమాసంగా పిలుస్తారు. శ్రావణం అంటే శుభం అని అర్ధం. ఈ మాసంలో అన్నీ శుభదినాలే అయినా అత్యంతశుభకరమైన రోజులు కొన్ని ఉన్నాయి.
శ్రావణమంగళవారాల్లో " మంగళగౌరీవ్రతం " చేసుకుంటారు పెళ్ళి అయిన స్త్రీలు. ముత్తయిదువులని ఆహ్వానించి కాళ్ళకి పసుపురాసి బొట్టుపెట్టి సెనగలు వాయినం ఇస్తారు. ఈ పసుపు వ్రాయడం ఓ అద్భుతమైన సంప్రదాయం. శ్రావణభాద్రపదాలు వర్షఋతువు, వర్షాలు పడి ఎక్కడ చూసినా నీరు ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు నీళ్ళలో ఎక్కువగా తిరగడం పాదాలు తడిసి వ్రేళ్ళమధ్య ఒరుసుకుపోవడం జరగుతుంది. పసుపు రాయడం పాదాలకు వ్రేళ్ళకు మంచిదని తెలుసుకోవాలి.
రెండవ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు. మహాలక్ష్మిని సౌభాగ్యం ప్రసాదించమని కోరుకుంటారు. కొబ్బరికాయను తీసుకుని దానిమీద తడిపిన వరిపిండితో కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏర్పాటుచేసి ఆ మూర్తికి పూజచేసుకుంటారు కొందరు.
ఈ వరలక్మీవ్రతం అత్యంత అద్భుతమైనది. పార్వతీదేవి ఈశ్వరుణ్ణి అడిగింది. గృహిణి ఒక్కరూ ఏ వ్రతం చేస్తే ఇటు పుట్టింటివారూ అటు మెట్టినింటివారూ కూడా సకలసౌభ్యాగాలతో వర్ధిల్లుతారూ అని. ఆయన ఈ వరలక్ష్మీవ్రతం చెయ్యమని చెప్పారు. లక్ష్మీదేవి ఎక్కడ ఎక్కడ తను ఏరూపంలో ఉంటానో చెబుతూ ఇంటిలో " గృహలక్ష్మి " గా ఉంటానని చెప్పింది. అందుకని ఇంటి ఇల్లాలు ఈ వ్రతం చేసి ఇంకో ఇంటి ఇల్లాలుకి వాయనం ఇస్తే లక్ష్మీదేవి పరమప్రసన్నురాలవుతుంది, అనుగ్రహిస్తుంది. అనుమానం అక్కరలేదు.
వెంకటేశ్వరస్వామిది శ్రవణం నక్షత్రం. అన్ని శ్రావణ శనివారాలు పవిత్రమైన రోజులే.
ఈ పౌర్ణమి " జంధ్యాలపౌర్ణమి ", యజ్ఞోపవితాన్ని మార్చుకుంటారు. ఈరోజు గాయత్రీదేవిని స్మరించుకుంటే మంచిది. ఆవిడ బుద్ధిని వికసింపచేసి మనస్సును పరదేవతవైపు మళ్ళిస్తుంది. దీనిని రాఖీపౌర్ణమిగా కూడా జరుపుకుంటారు.
మనకు " శ్రీలలితాసహస్రరహస్య " నామాలను ప్రసాదించిన శ్రీహయగ్రీవస్వామి జయంతి ఈ పౌర్ణమియే. ఆవిధంగా ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి.
బహుళ అష్టమి పరమాత్మ శ్రీకృష్ణభగవానుని పుట్టినరోజు. ఉట్టికొట్టడం వంటి సంబరాలు జరుపుకుంటారు భక్తులు.
శ్రావణ అమావాస్యను " పోలాలమ్మ " అమావాస్యగా జరుపుకుంటారు. కందమొక్క, పిల్లమొక్కకు పూజచేసుకుంటారు. సంతానసౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆవిడ.
ఎన్నో పవిత్రదినాలతో కూడినది ఈ శ్రావణమాసం. శ్రావణమాసమంతా ప్రతీ ఇల్లూ లక్ష్మీశోభతో కళకళలాడుతూ ఉంటుంది. వర్షాలు బాగుగా కురిసి పంటలు సమృద్ధిగా పండి జనులెల్లా సుఖసంతోషాలతో వర్ధిల్లేలా అనుగ్రహించమని ఆ పరదేవతని కోరుకుందాం.
సర్వే జనాః సుఖినో భవంతు.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment