స్థితప్రజ్ఞత అంటే ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" ప్రజహాతి యదా కామాన్
సర్వాన్ పార్ధ మనోగతాన్,
ఆత్మన్యేవాత్మనా తుష్టః
స్థితప్రజ్ఞస్తదోచ్యతే "
- భ.గీత 2:55
పరమాత్మ " ఓ పార్ధా, మనుజుడు ఎప్పుడు మానసిక కల్పితములయిన సర్వకామములను త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తినొందునో అప్పుడతను స్థితప్రజ్ఞుడు అని పిలువబడుతాడు " అని అన్నారు.
ఆస్థితిలో అతనిని ఏ తాపము బాధించదు, సుఖానికి ఉప్పొంగిపోడు, దుఃఖము కలిగినా కృంగిపోడు. రాగ ద్వేష క్రోధాలకు అతీతుడయి ఉంటాడు ( భ.గీత 2:56 ).
కంచిపరమాచార్యులకు 103 డిగ్రీల జ్వరం ఓరోజు. మగతగా కూర్చుని ఉన్నారు. శిష్యుడు వచ్చి వైద్యులు వస్తున్నారు అంటే ఎందుకు అన్నారు. మీకు జ్వరంగా ఉంది, చూసి మందు ఇవ్వడానికి అన్నాడు. జ్వరం ఎంతుంది అన్నారు స్వామి. 103 పైనే ఉంది అన్నాడు శిష్యుడు. సమయం ఎంతయింది అని అడిగితే 11.30 అయింది అన్నాడు శిష్యుడు. బయట ఎండ ఎలా ఉంది అన్నారు. మాడిపోతూంది అన్నాడు. అలాగా, అయితే స్నానంకి ఏర్పాటుచెయ్యి వెంటనే అన్నారు. 11.30 గంటలే అయింది అన్నాడు శిష్యుడు. " సరిపోతుంది " అన్నారు.
" అమ్మవారు శివుడిని వివాహం చేసుకోవడానికి ప్రచండాగ్నిలో తపస్సు చేసారు. అంత వేడిమిలో అలా ఎలా చేసింది ఆ తల్లి అని బాధగానూ ఆశ్చర్యంగానూ ఉండేది. ఈరోజు ఈ వేడి శరీరంతో మండుటెండలో కూర్చుని ధ్యానంచేసే అవకాశం ఇన్నాళ్ళకు వచ్చింది నాకు " అని సంతోషంతో స్నానం చేసి 12 గం.లకు ఎండలో బయట కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు.
రమణమహర్షికి చివరలో కాన్సర్. శిష్యులన్నారు " ఇప్పుడు మంచిమంచి మందులు వచ్చాయి, మాకోసం, భక్తులకోసమయినా మందులు వాడండి " అంటే ఆయన అన్నారు " ఇంతకాలానికి పరమేశ్వరుడు దయతలచి ఈరోగాన్ని అనుగ్రహించారు. ఇది అనుభవించేస్తే పాపప్రక్షాళన అయిపోతుంది. లేకపోతే మళ్ళీ జన్మ ఎత్తి అనుభవించాలి, వద్దులే " అని.
ఎంత కఠిన సాధన చేసి ఉంటే ఆ స్థితికి చేరుకుని ఉంటారు. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందిన మహానుభావులు.
"స్థితప్రజ్ఞులు, కారణజన్ములు"
ఏతత్ సర్వం శ్రీ కార్తీకదయాదామోదార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment