సమస్య శక్తికి మించినది అయితే అమ్మవారికి వదిలేయాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీరస్తు శుభమస్తు"🙏
" కార్పణ్యదోషోపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః,
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తే2హం శాధి మాం త్వాం ప్రపన్నమ్ "
- భ.గీత 2:7
" పిరికితనం వలన ఏమి చేయాలో తెలియటంలేదు. ఏమి చేయాలో చెప్పు. నీవే శరణు " అన్నాడు అర్జునుడు పరమాత్మతో.
ఇదే ఎవరయినా ఆఖరికి చేయవలసినది. సమస్యకు పరిష్కారం కోసం శాయశక్తులా కృషి చేయాలి. ఇక తనవల్లకాదు, పరిష్కారం తన శక్తికి మించినదిగా అనిపించగానే పరమాత్మను శరణు వేడాలి.
పరమాత్మ గజేంద్రుడిని ద్రౌపదిని అలాగే ఆదుకున్నారు.
రామాయణం సుందరకాండలో ఓ అద్భుత ఘట్టం ఉంది.
లంకంతా వెదికి సీతమ్మ జాడ తెలియకపోయేసరికి హనుమ కలవరపడి ఇలా అనుకుంటారు:
" రావణుడు సీతమ్మని వేరే ఎక్కడయినా ఉంచాడా. సీతమ్మ పెనుగులాటలో పట్టు తప్పి సముద్రంలో పడి మరణించి ఉంటుందా. నేను తిరిగి వెళ్ళి సీతమ్మ కనబడలేదు అని చెబితే వెంటనే రాముడు ప్రాణాలు వదులుతారు. అప్పుడు లక్ష్మణుడు, అయ్యో ఈ మాత్రం సహాయం కూడా చేయలేకపోయానే అని సుగ్రీవుడు ప్రాణాలు వదులుతారు. వానర వీరులందరూ ప్రాణాలు విడుస్తారు. ఇంత మంది మరణానికి కారణం అవడం కన్నా సముద్రంలో పడో అగ్నిలో దూకో మరణించడం మంచిది " అని తలుస్తారు.
ఒక్క క్షణమే. వెంటనే అనుకుంటారు " మనిషికి నిరాశే ఎక్కువ హాని చేస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహంగా ఉంటే అన్ని పనులు సానుకూలంగా జరుగుతాయి " అని.
ఇక్కడ హనుమ ఓ చక్కటి ఆలోచన చేస్తారు.
" ఉత్సాహంగా వెదుకుతాను. మళ్ళీ వెతుకుతాను. ఇక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ వెదుకుతాను. అప్పటికీ కనబడకపోతే తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండి పోతాను. నేను ఎప్పటికయినా వస్తానని ఆశతోనయినా అక్కడ అందరూ ప్రాణాలతో ఉంటారు " అనుకుంటారు.
ఇక్కడ హనుమ చివరిగా " తపస్సు " చేసుకుంటానన్నారు. భగవధ్యానం. అదే శరణాగతి, భగవంతుడిపై భారం వేసేయడం. అటుపై అన్నీ పరమాత్మే చూసుకుంటారు.
అదే జరిగింది. ఇలా అనుకుని వెనక్కి తిరగ్గానే " అశోకవనం " కనబడింది. సీతమ్మ జాడ తెలిసింది. " అవ్యాజకరుణామూర్తి " పరమాత్మ. అలా ఆయన్ని తలచుకోగానే దారి చూపిస్తారు.
ఏతత్ సర్వం శ్రీశ్రీకృష్ణార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment