గణపతిని ప్రార్ధిస్తే 7 కోట్ల గణపతులు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

భండాసురుని తమ్ముడు విశుక్రుడు అమ్మవారి సేనల మధ్యలోకి జయవిఘ్నశిలాయంత్రాన్ని విసిరి అమ్మవారు, సైన్యం పని అయిపోయింది అని భావించాడు.

కాని అమ్మవారి సేనలు మళ్ళీ విజృంభించడంతో విశుక్రుడు ఆశ్చర్యపోయాడు. జయవిఘ్నశిలాయంత్రానికి ఏమయింది, ఎందుకు పనిచేయడం లేదూ అని. విషయసేకరణ చేస్తే ఆ యంత్రాన్ని ఓ తొండం ఉన్నాయన పిండిచేసేసాడని తెలిసింది.

తొండం ఆయన ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అతని వైపు కూడా ఓ తొండం ఉన్న రాక్షసనాయకుడు ఉన్నాడు మరి. అతని పేరు గజాసురుడు. అతన్ని పిలిచి " నీ సేనలతో వెళ్ళి యంత్రాన్ని పాడుచేసిన తొండపాయన్ని చంపేసి రా " అని ఆదేశించాడు. వాడు రాక్షససేనలతో బయలుదేరి వెళ్ళాడు.

ఎదురుగా చూస్తే వల్లభగణపతి ఒకరే ఉన్నారు. గజాసురుడు ఆశ్చర్యపోతే గణపతి చిరునవ్వు నవ్వారు. చూస్తూ ఉండగానే వల్లభగణపతి రోమాల్లోంచి 7 కోట్ల గణపతులు బయటకు వచ్చారు. వారు సింహవాహనాలమీద, ఎలుకల, ఏనుగులవాహనాలమీద కూర్చుని తయారుగా ఉన్నారు యుద్ధానికి. రాక్షససేనలన్నింటినీ మట్టుపెట్టేసి వల్లభగణపతిలో లీనమయిపోయారు ఆ 7 కోట్ల గణపతులు. ఎదురుగా వంటరిగా ఉన్న గజాసురుడిని పట్టుకుని మాంసపుముద్దగా చేసేసి అమ్మవారి వద్దకు వెళ్ళి " అమ్మా మీరు అప్పగించిన పని పూర్తయింది " అని చెబుతే అమ్మవారు ఓ చిరునవ్వు నవ్వారు.

దీని అర్ధం ఒక్క వల్లభగణపతి అనుగ్రహం పొందుతే 7 కోట్ల గణపతుల అనుగ్రహం లభించినట్లు.

ఆయన మూలగణపతి. ఆయన అనుగ్రహించలేని సంపదకాని, వేరేదయినా కాని లేదు. శివపార్వతుల కళ్యాణంలో కూడా గణపతిపూజ జరిగినట్లు పురాణాలు తెలియచేస్తున్నాయి.

ఆయన్ని " సుముఖశ్చ ఏకదంతశ్చ ...." అని ప్రార్ధిస్తాం. ఆయన సుముఖుడు. ఆయనది ఎంత సుందరరూపం అంటే గణపతిని చూడగానే మురిసిపోయి శివుడు స్తోత్రం చేసారు. అదే అద్భుతమైన " గణపతి సహస్రనామ స్తోత్రం ". దానికి ఫలస్తుతి స్వయంగా గణపతే చెప్పారు.

అందరినీ చల్లగా చూడమని " అవ్యాజకరుణామూర్తి " వల్లభగణపతిని కోరుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ