అమ్మవారు ఇవ్వలేనిది లేదు, నమ్మి సేవిస్తే ఇవ్వకుండానూ ఉండరు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏 

" శాశ్వతైశ్వర్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 952 వ నామం .

" శాశ్వతైశ్వర్యా " అంటే నిత్యమగు ఐశ్వర్యము గలది. ఐశ్వర్యము అంటే ధనము అని కాదు. మంచి జ్ఞానం, వాక్కు, ఆరోగ్యం, మంచితనం, పరోపకారం వంటివి అన్నీనూ. ఇవన్నీ అమ్మవారి దగ్గర పుష్కలంగా ఉన్నాయి. తనను నమ్ముకున్న వారికి వారి వారి కర్మఫలాలను బట్టి అవసరమయినంత ఐశ్వర్యం ఇస్తారు.

మూక శంకరులు స్తుతిశతకంలో కామాక్షీదేవిని ఇలా స్తుతిస్తారు:

శ్రియం విద్యాం దద్యాజ్జనని నమతాం కీర్తిమమితాం
సుపుత్రాన్ ప్రాదత్తే తవ ఝటితి కామాక్షి కరుణా,
త్రిలోక్యామాధిక్యం త్రిపురపరిపంథిప్రణయిని
ప్రణామస్త్వత్పాదే శమితదురితే కిం న కురుతే " - 52

" అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే సంపదను, విద్యను, అమితమైన కీర్తిని, సుపుత్రులను, త్రైలోకాధిక్యమును ఇస్తారు దయతో. ఆవిడ పాదాలను పట్టుకోవడానికి ఎందుకు ఆలోచన, ఆలస్యం? " అని.

తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారికి ఓ సిద్ధపురుషుడు " బాల " మంత్రాన్ని ఉపదేశించారు. మరి శాస్త్రిగారు ఎన్నికోట్ల " బాల " జపం చేసారోకాని ఓరోజు జపం ముగించి కళ్ళు తెరిచేసరికి ఆయన ఒడిలో ఓ పాప కూర్చుని ఉంది. ఈయన ఆశ్చర్యపోయి " ఎవరి అమ్మాయివమ్మా నువ్వు " అని అడిగితే ఆ పాప " పిలిచేవుగా, వచ్చాను, ఏమి కావాలో కోరుకో. చక్రవర్తిని చెయ్యనా, అష్టైశ్వర్యాలు కావాలా " అని అడిగేసరికి ఆయనకు విషయం అర్ధమయి " అవన్నీ నాకెందుకమ్మా, ఇప్పుడు వచ్చినట్లుగానే అప్పుడప్పుడు వస్తూండమ్మా " అని కోరుకోగానే కిలకిలా నవ్వి అంతర్ధానమయ్యిందిట అమ్మవారు.

అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే ఆవిడ ఇవ్వలేనిదీ లేదు, అడగకపోయినా ఇవ్వకుండానూ ఉండరు. అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ