మమకారం - నాది నావారు అనేది చాలా చెడ్డది, తగ్గించుకోవాలి - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" నిర్మమా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 164 వ నామం .
" నిర్మమా " అంటే మమకారము లేనిది. మమకారం అంటే నాది/నావారు అని. అటువంటి భావన అమ్మవారికి ఎందుకుంటుంది, అందరూ తనవారే అయినప్పుడు.
తరగతిలో 40 మంది విద్యార్థులు ఉంటారు. అందరికీ ఉపాధ్యాయులు చెప్పేది ఒకటే పాఠం. వారికి ఇష్టమయిన వారు, ఇష్టంలేని వారు అని ఏమీ ఉండదు. కాని బాగా చదివేవారిని అభిమానిస్తారు. అంతేకాని మమకారం ఉండదు. బాగా చదివే విద్యార్ధికి సందేహాలేమయినా ఉంటే ప్రత్యేక శ్రద్ద తీసుకుని సందేహాలు తీరుస్తారు.
ఉపాధ్యాయులే ఇలా ఉంటే మరి అమ్మవారు ఎలా ఉంటారు. " పద్మపత్రమివాంభసా " తామరాకు మీద నీటి బొట్టులా ఉంటారు. తనని నమ్ముకున్న వారికి అవసరమయిన సహాయం చేస్తారు.
పరమాత్మ గీతలో ఇలా తెలియచేసారు:
"సమో2హం సర్వభూతేషు
న మే ద్వేష్యో2స్తి న ప్రియః,
యే భజంతి తు మాంభక్త్యా
మయి తే తేషు చాప్యహం "
- భ.గీత 9:29
నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతోవ్యాపించి యుందును. నాకు అప్రియుడు గాని, ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని, నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉందును.
అమ్మవారిని శ్రద్ధగా సేవించుకుని వారి అనుగ్రహాన్ని పొందుదాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment