మన నాట్యం శాస్త్రీయం, లాస్యం, ప్రశాంతత - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" లాస్యప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 738 వ నామం .
" లాస్యప్రియా " అంటే నాట్యమును ఇష్టపడునది అని అర్ధం. లాస్యం అంటే నాట్యం. నాట్యం అన్నా నాట్యం చేసేవారన్నా అమ్మవారికి ఇష్టం.
ఆదిదంపతులు చేసే నాట్యం ఒక అద్భుతం. వారి నాట్యం చూసి ఆనందించడానికి బ్రహ్మ విష్ణువులతో సహా దేవతలందరూ కైలాసానికి చేరుకుంటారుట.
కృష్ణుడు గోపికలతో చేసే " రాసలీల " భక్తినే కాకుండా తత్వాన్ని, అద్వైతాన్ని బోధిస్తుంది.
ఈ నాట్యవిజ్ఞానాన్ని నందికేశ్వరుడు గ్రహించి బ్రహ్మకు తెలియచేసారు. బ్రహ్మ నుంచి భరతముని తెలుసుకుని గ్రంధస్తం చేసారు. అది భరతనాట్యంగా విశ్వఖ్యాతి పొందింది.
ఈ గ్రంథంలో నాట్యానికి సంబంధించిన విజ్ఞానము, మెళకువలు అన్నీ ఉండడంతో దీనిని నాట్యశాస్త్రం/నాట్యాంగం/నాట్యవేదం అని పిలుస్తారు. నాట్యంలో శరీరంలోని అన్ని అంగాలూ, కళ్ళతో సహా, తమ పాత్రను పోషిస్తాయి. చేసేవారికి భగత్సేవాఫలంతో బాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చక్కటి వ్యాయామం కూడా. చూసేవారికి ఆధ్యాత్మికభావం పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఈ సనకసనందనాదులు జ్ఞానసముపార్జనకై కైలాసానికి వెళ్ళారు ఓ రోజు. అక్కడ శివపార్వతులు నాట్యం చేస్తున్నారు, దేవతలు, ప్రమధగణాలు ఆనందంతో తిలకిస్తూ ఊగి పోతున్నారు. ఇలా భార్యతో కూడి నాట్యాలు చేసే ఆయన జ్ఞానాన్ని ఏమి ఇస్తాడు అని తలచి వీరు తిరిగి వెళ్ళిపోతారు.
వీరు అసంతృప్తితో తిరిగి వెడుతూంటే దారిలో పెద్ద మర్రిచెట్టు క్రింద ఓ పిల్లాడు కూర్చుని ఉంటే ఆయన ముందర పెద్దవయస్సు వారైన ఎందరో ఋషులు కూర్చుని ఉంటారు. ఆశ్చర్యంతో వీరు దగ్గరకు వెళ్ళడం, ఆ పిల్లవాడి చిరునవ్వు చూడడంతోనే వీరికి సంపూర్ణ జ్ఞానోదయం అవడం జరిగింది. ఆ పిల్లవాడి కుడిచెవికి మకరకుండలం ఎడమచెవికి తాటంకం ఉండడం గమనించి ఆయనే " గురు " దక్షిణామూర్తిగా గ్రహించి ఆయన్ని సేవించుకుని ధన్యులయ్యారు.
ఒక్క క్షణం ఆదిదంపతుల నాట్యం చూసిన సనకసనందనాదులు అద్భుత జ్ఞానాన్ని పొందారు. నాట్యం శాస్త్రీయం, విజ్ఞానం. అందుకే అమ్మవారికి అంత ప్రీతి. అందుకే వేల సంవత్సరములు అయినా దినదిన ప్రవర్ధమానంగా వెలుగుతూంది.
నాట్యం వేరు. తాండవం వేరు. ప్రకృతికి విరుద్ధంగా ఏదయినా జరిగినప్పుడు శివుడు తాండవం చేస్తారు. అప్పుడు విలయం అంటే భూకంపాలూ తుఫానులూ లాంటివి ఏర్పడుతాయి. రావణుడు శివతాండవ స్తోత్రం చేసారు. అది వింటేనే బుర్రలో ప్రకంపనలు కలుగుతాయి. అందుకే ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు.
" లాస్యప్రియ " అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment