అమ్మవారి " మాయ " లేకపోతే జీవితం దుర్భరం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" మాయా " - అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 716 వ నామం.

" మాయ " అంటే " ఊహకందనిది ". అమ్మవారి లీలలను మనమెలా ఊహించగలం. ఏదయినా ఒక విషయం ఎలా జరిగిందో ఊహకి అందకపోతే " మాయ " అని అనుకుంటాం. సృష్టిలో ఎన్నో వింతలు గమనిస్తూంటాం, అలా వింతలు లేకపోతే అందమే లేదు. ఈ " మాయ " జీవుల మంచికోసమే. కొన్ని విషయాలను తట్టుకోలేం. ఉదా: చాలా కావలసినవారు ఒకరు కాలం చేస్తే తట్టుకోలేరు. కాని అది ఒకటి రెండు రోజులే. మాయా ప్రభావంతో బయటపడిపోతారు, అది జరిగిందన్న స్పృహ కూడా ఉండదు. లేకపోతే నిరాశా నిస్పృహలకు లోనవడం, సృష్టి అంతరించడం జరుగుతుంది. ఈ మాయ తొలగుతేనే అమ్మవారు తెలుస్తారు. కాని మహామహులకు కూడా మాయ తొలగడం కష్టమే.

భగవద్గీతలో పరమాత్మ అంటారు:

"దైవిహ్యేషా గుణమయీ 

 మమ మాయా దురత్యయా" 

               - భ.గీత 7:14

అంటే " త్రిగుణాల ప్రభావం వలన నా మాయ నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు " అని. కాని ఆయన్ని/అమ్మవారిని ఆశ్రయించి శరణుకోరినవారు మాయను దాటడానికి అవకాశం ఉంది. 

అర్జునుడు అంటాడు " మహామహులకే ఈ మనస్సును నిగ్రహించుకోవడం కష్టమే, నా వల్ల అవుతుందా " అని. స్వామి అంటారు " కష్టమే కాని సాధనతో మెల్లిమెల్లిగా నిగ్రహంలోకి తెచ్చుకోవచ్చు ( కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు ) " అని ( గీత 6.36 ).

శ్రీవరాహపురాణంలో శ్రీ మహావిష్ణువు తన మాయలు ఏవిధంగా ఉంటాయో శ్రీమహాలక్ష్మికి చెబుతారు. ఉదా: ఒక తుఫాన్ వచ్చిందనుకోండి. విపరీతమైన గాలి, చెట్లు కూలడం, భయంకరమైన వర్షం. 1,2 రోజులు అంతే, 3వ రోజు దాని స్పృహే ఉండదు. తుఫాన్ వచ్చి వెళ్ళిందా, నిజమేనా అనిపిస్తుంది.

రోజూ ఎన్నో వింతలు చూస్తూ ఉంటాం. కొన్ని పనులు విచిత్రంగా పూర్తి అవుతే " నిజంగా అయిందంటావా, కలకాదు కదా " అని ఆశ్చర్యంలో మునిగిపోతాం. అందుకే అమ్మవారిని " విచిత్రకార్య కరణీ " అని కొలుస్తారు ఋషులు. ఎంత విచిత్రంగా అనిపించినా ఆవిడ చేసే పనులన్నీ లోకకళ్యాణం కోసమే. 

అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ