శివుడు స్మశానంలో ఉండడానికి కారణం ఏమిటి? - చీమలపాటి సూర్యనారాయణ
🙏 " శ్రీరస్తు శుభమస్తు " 🙏
శివుడిని ఋషులు అడిగారు " స్వామీ అందమైన కైలాసంలో పార్వతితో హాయిగా గడపక ఇలా శ్మశానాలలో తిరుగుతూంటావు, ఎందుకని " అని.
స్వామి అన్నారు " జీవుడు పాపప్రక్షాళనకోసం, జన్మరాహిత్యం కోసం జన్మ తీసుకుని చాలా కష్టపడతాడు. వీలయినన్ని పుణ్యకార్యాలు చేస్తాడు. పెళ్ళిచేసుకుని కొందరికి జన్మనిచ్చి వారికోసం నానాపాట్లూ పడతాడు. తన సుఖాన్ని , తనముక్తినీ కూడా మరచిపోయి సంతానంకోసం ఆస్తులు సంపాదించిపెడతాడు. చివరికి చనిపోయాక జీవుడితో ఇంటిగుమ్మందాకా భార్య, ఊరిచివరిదాకా కొందరు, శ్మశానికి కొందరూ వస్తారు. దహనం అవగానే ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోయాక జీవుడు ఒంటరిగా మిగిలిపోయి తను ఎంత మూర్ఖుడో, సమయాన్ని ఎలా వ్యర్ధం చేసుకున్నాడో తలచుకుని కుమిలిపోతాడు. ఆసమయంలో అతన్ని ఓదార్చడానికి ఎవరూ ఉండరు. అందుకని అటువంటివారిని దగ్గరకు తీసుకుని ఓదార్చడానికే నేను శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాను " అని
ఎంతటి అద్భుత విషయం. అవ్యాజకరుణామూర్తి స్వామి.
బయటివారే " ఇంతచేసాను, గౌరవంలేదు " అని బాధపడే అవకాశాన్ని ఇస్తే ఎవరికీ మంచిదికాదు. మరి పితృదేవతలు " అయ్యో ఇంతకష్టపడి పిల్లలని వృద్ధిలోకి తీసుకొచ్చాను, కనీసం తలచుకోనేనా తలచుకోవట్లేదు నా పిల్లలు " అని కొద్దిగా బాధపడినా ఆ వంశానికి మంచిదికాదు.
ఋషులు పాపనాశనం కోసం పంచయజ్ఞాలు చేయాలి అని తెలియచేసారు:
" అధ్యాపనం బ్రహ్మయజ్ఞం,
పితృయజ్ఞస్య తర్పణం,
హోమో దైవో, బలిర్భౌతో,
అతిధి భోజనం "
వీటిలో ముఖ్యమైనది పితృయజ్ఞం - వారికి తర్పణాలు వదలడం లాంటివి
ఇవి చెయ్యడంవల్ల పంచసూనదోషాలే పోతాయనుకో కూడదు. దానితోబాటు గ్రహదోషాలు పోతాయి, జీవితం సుఖమయమవుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది.
ఈరోజు నుంచి మహాలయ పితృపక్షాలు. ఈ 15 రోజులు మనవైపు చూస్తూ ఉంటారు పితృదేవతలు. వీలయితే వారు మరణించిన తిధినాడు లేకపోతే ఏరోజునయినా ఒక్కసారి వారిని తలచుకుని కృతజ్ఞతలు ( తర్పణాలు, దానాలు, భోజనాలు ) చెప్పుకుంటే వంశాభివృద్ధి జరుగుతుంది.
ఆ విధంగా చేసి అందరం పితృదేవతల అనుగ్రహం పొందుదాం. మహాలయపక్షం రోజులని సద్వినియోగం చేసుకుందాం.
మిత్రులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాది భోగభాగ్యములను మనశ్శాంతిని ప్రసాదించమని " అవ్యాజకరుణామూర్తి " పరమేశ్వరుడిని కోరుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment