అమ్మవారు పాపాలను నాశనం చేస్తారా? - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" పాపనాశినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 167 వ నామం .
" పాపనాశినీ " అంటే భక్తుల పాపాలు పోగొట్టునది.
అదెలా సాధ్యం. అమ్మవారు " పద్మపత్రమివాంభసా " అంటే తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు కదా. మన కర్మలకు మనమే బాధ్యులం కదా. పాపాలను ఎలా పోగొడతారు.
ఎంత పాపాత్ముడయినా తప్పు తెలుసుకుని పరివర్తన చెంది అమ్మవారిని శరణాగతి కోరి కఠిన సాధన చేస్తే పాపాలను నశింపచేస్తుంది.
ముద్గలుడు అని ఓ మహర్షి ఉండేవారు. ఆ సమయంలోనే ఓ దొంగ ఉండేవాడు. ఆ దొంగ క్రూరుడు, పరుల డబ్బుమీదే బ్రతికేవాడు. ప్రజాధనం, ప్రభుత్వ సంపద, ప్రకృతివనరులు అన్నీ దోచేసేవాడు. ఎంత నీచుడంటే ఎవరయినా బయటకు వెడుతూంటే ఇంట్లో ఏదయినా తిని వెడతారు, వీడు తినకుండానే వెడతాడు. ఎందుకంటే ఎవరో ఒక బాటసారి ఎదురుపడకపోడు కనుక వాడిని కొట్టి అవసరమయితే చంపేసి వాడి దగ్గరున్నది తీసుకుని తినడం అలవాటయిపోయింది వీడికి.
ఓ రోజు అలాగే బయలుదేరాడు. ఆశ్చర్యంగా మధ్యాహ్నం దాకా ఎవరూ ఎదురుపడలేదు. బాగా ఆకలిగా ఉండడంతో ఏదయినా చిన్న జంతువు దొరుకుతుందేమో చంపి తిందామని అడవిలోకి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఏదీ దొరకలేదు. ఓ సరస్సు కనబడింది, అది గణేశతీర్థం. అమ్మయ్య అనుకుని దానిలో స్నానం చేసి నీరు త్రాగాడు.
మళ్ళీ ఆకలి మొదలవడంతో ఎదరికి పోయాడు. అక్కడ ఓ చెట్టుక్రింద ఓ మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. అమ్మయ్య ఈయన దగ్గర ఏదో ఒకటి ఉండకపోదని ఆయన దగ్గరకు పోయి " ఆకలిగా ఉంది, ఏదో ఒకటి వెంటనే పెట్టు " అని అరిచాడు. ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు, కదలలేదు, చూడలేదు. దొంగ ఆయనను చేతులతో కుదిపేడు. ప్రయోజనంలేక ఆయన్ని చంపేద్దామని వరలోని కత్తితీసి తల నరికేయడానికి కత్తి పైకి ఎత్తాడు. అంతే అలా బిగుసుకుపోయాడు.
ఆ మహర్షి ముద్గలుడు. కొంతసేపటికి ఆయన కళ్ళుతెరిచేటప్పటికి కనులవెంట ధారగానీరుకారుతూ దొంగ కనబడ్డాడు. మహర్షి " ఎవరు నాయనా నువ్వు, ఎందుకు ఇలా నిలబడి ఏడుస్తున్నావు " అని అడిగేసరికి మహర్షి మాటల శక్తివలన దొంగలో చలనం వచ్చి మహర్షి కాళ్ళమీదపడిపోయాడు దొంగ.
" నేను పరమ క్రూరుణ్ణి, అవినీతిపరుణ్ణి, ఎందరినో చంపేసాను. నన్ను కరుణించి తరించేమార్గం చెప్పండి " అంటూ మహర్షి కాళ్ళను కన్నీటితో కడిగేసాడు దొంగ.
మహర్షి చలించిపోయి " ఆ చెట్టుక్రింద కూర్చో, ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు " అని చెబుతూ ఓ ఎండిపోయిన పుల్లను అక్కడ ప్రాతి " ఈ పుల్ల చిగురించేవరకూ జపం చేస్తూనే ఉండు " అని చెప్పి ఆయన వేరే పనిమీద వేరే చోటికి వెళ్ళిపోయారు.
కొంతకాలం తరువాత తిరిగివచ్చిన మహర్షి దొంగను చూసి ఆశ్చర్యపోయారు. కూర్చున్నచోటులోనే ఉన్నాడు దొంగ, పుల్ల చిగురించి ఆకులతో ఉంది. ఎంత శ్రద్ధగా జపం చేసాడు అని దొంగను చేతితో తట్టి లేపాడు. దొంగ కళ్ళుతెరిచి గురువు మహర్షిని చూసి కాళ్ళపై పడిపోయి " నన్ను ఒక మంచి మనిషిగా చేసారు, ధన్యుడిని " అనగానే మహర్షి " నువ్వు మామూలు మనిషివికావు, నీ అద్భుత ధ్యానం వలన నీ నుదిటిమీద గణేశుని తుండం కనబడుతూంది, ఇకపై నీ పేరు " భృశుండమహర్షి " అన్నారు. శుండము అంటే తుండము. మహర్షి ఉపదేశించిన మంత్రం " గణేశాయనమః ".
అలా అనుగ్రహిస్తారు అమ్మవారు తప్పు తెలుసుకుని శరణాగతి కోరితే.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment