అమ్మవారి చేతిలో దండం మనకు రక్ష - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" వజ్రిణీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 944 వ నామం .
" వజ్రిణీ " అంటే వజ్రాయుధము గలది. వజ్రిణీ అంటే ఇంద్రాణి. ఇంద్రుడి భార్య. వేదం పూజించమన్న దేవతలు అగ్ని, వరుణుడు, వాయువు వంటి ప్రకృతిదేవతలతో బాటు ఇంద్రుడు, రుద్రుడు అని తెలియచేస్తూంది.
మహామంత్రపుష్పంలో " త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః " అని కీర్తిస్తాం.
ఇంద్రుడు అనగా మనం పురాణాలలోనూ సినీమాలలోనూ చూసే ఆయనకాదు, అది ఒక పదవి మాత్రమే, మారుతూ ఉంటారు. కాని వేదాలలో ఉన్న ఇంద్రుడు జీవుల ఇంద్రియాలకు అధిపతి, నియంత్రించేవారు.
వేదం ఇంద్రుడు అంటే పరమేశ్వరుడు అని తెలియచేసింది. భగవత్ శాసనాన్ని వజ్రం అంది వేదం. దండం పట్టుకోవడం పెద్దల లక్షణం. ఋషులకు కూడా దండం ఉంటుంది.
" మహత్ భయం వజ్రముద్యతం " - మహా భయంకరమైనది వజ్రాయుధం.
శ్రీ సూక్తంలో అమ్మవారిని ఇలా స్తుతిస్తాం:
" ఆర్ద్రాం యః కరిణీం యష్టిం
సువర్ణాం హేమమాలినీం "
ఇందులో యష్టిం అంటే దండం. దండంని పట్టుకుని ఉంటారు అమ్మవారు.
మనం తరచుగా ఏకదండి, ద్విదండి, త్రిదండి అని వింటూంటాం. ఏకదండి - అద్వైతం - శంకరులు - జీవాత్మ పరమాత్మ ఒకటే - ఒకటే దండాన్ని పట్టుకుంటారు. ద్విదండి - ద్వైతం - మధ్వాచార్యులు - జీవాత్మ వేరు, పరమాత్మ వేరు - రెండు దండాలు కలిపి పట్టుకుంటారు. త్రిదండి - విశిష్టాద్వైతం - రామానుజాచార్యులు - జీవాత్మ పరమాత్మ ప్రకృతి వేరు వేరు - మూడు దండాలు పట్టుకుంటారు.
అమ్మవారి చేతిలో ఒకటే దండం. జీవులందరిలో ఉన్నది అమ్మవారి అంశయే.
అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment