అపాత్రదానం కుదరదంది శాస్త్రం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏" శ్రీరస్తు శుభమస్తు "🙏

దానం - దయ అంటే ఏమిటి?

అన్నంలేనివారికి అన్నం, నీరులేనివారికి నీరు, వస్త్రం లేనివారికి వస్త్రం ఇవ్వడాన్ని దయ అంటారు.

దానం అంటే సంకల్పం చేసుకుని గ్రహదోషానికో మరొకపాపపరిహారానికో చేసేది. తెలియకుండా అందరూ కొన్ని పాపాలు చేస్తూంటారు. వాటి పరిహారంకోసమే వీటిని చెయ్యమన్నారు. అంతేకాని 4 హత్యలు చేసి 200 మందికి అన్నం/వస్త్రం దానం చేస్తానంటే కుదరదు. పాపఫలం పుణ్యఫలం వేరువేరుగా అనుభవించవలసి వస్తుంది. అంతేకాని బేలన్స్ షీట్ లో లాగ " నెట్ " ఫలం ఉండదు.

దానం చేసేవారూ తీసుకునేవారూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దానం తీసుకునే ఆయన యోగ్యుడయి ఉండాలి. దానం తీసుకుంటే దోషాలు వస్తాయి. దాని విరుగుడుగా జపమో తపస్సో లేక వేరొక పరిహారమో చేసుకోవాలి.

ఒకాయనకి కిడ్నీకాని కన్నుకాని కావాలి. ఎలా వస్తుంది. ఇంకొకతను పోగొట్టుకుంటే వస్తుంది. ఇతని పాపం పోవాలంటే ఇంకొకతను ఆ పాపాన్ని మొయ్యాలి. అందుకని జాగ్రత్తగా ఉండాలి.

" హిరణ్యం భూమిమశ్వం 

  గామన్నం వాసస్తిలాన్  

  ఘృతం ప్రతిగృహ్ణన్ అవిద్వాంసు 

  భక్తీవంతి దారువత్ " అన్నాయి శాస్త్రాలు.

" అపాత్రదానం " కుదరదంది శాస్త్రం.

కారులో వెడుతూన్నప్పుడు సిగ్నల్ దగ్గర ఓ బిచ్చగాడు వచ్చి చెయ్యి చాపుతాడు. 2,5,10 రూపాయలు ఇవ్వాలి, ఇవ్వాలనిపిస్తే. 100,500 ఇవ్వకూడదు. డబ్బు మాయచేస్తుంది. పాపం, అని 100 ఇస్తే, తీసుకుని అతను ఆనందంతో వెనక్కి తిరగగానే కనిపిస్తుంది " సర్కారువారి పండుగ ఆఫర్ - 50కే క్వార్టర్ లేక ఒకటి కొంటే ఒకటి ఫ్రీ " అని బోర్డ్, మందు షాపూ. వెళ్ళి 2 సీసాలు త్రాగుతాడు. తూగుతూ వచ్చి ఏ బండిక్రిందో పడి కాలు విరగ్గొట్టుకుంటాడు. త్రాగడం, పడడం అతని తప్పు అయినా త్రాగాలనే ఇచ్ఛలేనివాడికి ఆకోరిక కలిగింది ఈ 100 తో. తగిన పాపం ఇచ్చిన ఈయనకీ అంటుకుంటుంది, అతని కుటుంబం రోడ్డున పడినందుకు.

కొందరికి అసలు దానం ఇవ్వకూడదు. వీరిని " బకవ్రతుడు, బిడాలవ్రతుడు " అంటారు. 

బకవ్రతుడు - రహస్యంగా అపచారం చేస్తారు. వినయంగా నటిస్తారు. స్వార్ధంకోసం ఏపని అయినా చేస్తారు. కొంగజపం అంటారు అందుకే.

బిడాలవ్రతుడు - ధర్మం ఆచరిస్తూన్నట్లు నటిస్తారు. ఇతరులను ఆక్షేపిస్తారు, వంచిస్తారు, హింసిస్తారు.

అలా అని దానాలు ఇవ్వడం మానకూడదు. తన సంపాదనలో కొంతభాగం కష్టాల్లో ఉన్నవారికోసం ఖర్చుచేసి తీరాలని సనాతనధర్మం తెలియచేస్తూంది.

ఇదివరకు గ్రామాల్లో ఆర్ధికంగా వెనుకబడి బాధపడుతూన్నవారు - పిల్లల చదువులు, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, ప్రసవాలు - తెలుస్తూ ఉండేవారు. ఊరికే ఇస్తే తీసుకోరని దానం రూపేణా ఇచ్చేవారు. ఇప్పుడూ అలాంటివారు ఉన్నారు. కష్టపడి అయినా అలాంటివారిని గుర్తించి దానం ఇస్తే అనుకున్న ఫలితం వస్తుంది. లేకపోతే " అపాత్రదానం " గా మారి బెడిసికొడుతుంది. దారినపోయేవాడికి దానం చేసేసి " అమ్మయ్య పాపాలన్నీ పోయాయి " అనుకుని తృప్తి పడితే ప్రయోజనంలేదు. తస్మాత్ జాగ్రత్త.

కాని అన్నదానంలో ఈ సమస్య లేదు. ఆకలిగా ఉన్నవాడే పైగా ఎంతవరకూ తినగలడో అంతవరకే తింటాడు. దాచుకుందాం అనుకున్నా 2,3 రోజులకన్నా నిలవుండదు. అపాత్రదానానికి ఆస్కారం లేదు.

మహాలయపక్షాలలో చేసే అన్నదానానికి విశేష ఫలితం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ