మన కర్మఫలాలను మనమే అనుభవించాలి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" కార్యకారణనిర్ముక్తా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 862 వ నామం.

" కార్యకారణనిర్ముక్తా " అంటే కార్యములచేతను, కారణములచేతను విడువబడినది.

ఏదయినా కార్యం చేయాలంటే దానికి ఓ కారణం ఉండాలి. కారణంలేని కార్యం ఉండదు. ఓ ఊరు వెడుతున్నామంటే దానికి ఓ కారణం ఉంటుంది. ఓ ఉద్యానవనంకి వెళ్ళినా వ్యాయామం అనో మానసిక ప్రశాంతత అనో కారణం ఉంటుంది.

ప్రతీరోజూ కంచిపరమాచార్య గారు చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం, పూజ చేస్తారు. దానికి కూడా " లోకకళ్యాణం " కోసం అనే కారణం ఉంటుంది. కారణం లేని కార్యం ఉండదు.

అమ్మవారికి కావలసిందీ లేదు, పొందవలసినదీ లేదు. అంటే కారణమేమీ ఉండదు. కారణం లేనప్పుడు కార్యమూ ఉండదు. 

పరమాత్మ గీతలో ఇలా అంటారు:

" మయాఽధ్యక్షేణ ప్రకృతిః 

  సూయతే సచరాచరమ్,

  హేతునానేన కౌన్తేయ 

  జగద్విపరివర్తతే "

" ఓ అర్జునా! జగత్తుకు అంతా నేను అధ్యక్షుడను. ఈ చరాచర ప్రకృతి, అందులోని సృష్టి నా ఆధ్వర్యములోనే జరుగుతున్నాయి. ఈ జగత్తు అంతా ఒక నియతి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంది. నేను మాత్రం సాక్షిగానే ఉంటాను ఏమీ చేయను " అని. అంటే కారణమూ లేదు, కార్యమూ లేదు.

తామరాకు మీద నీటిబొట్టులా ఉంటారు అమ్మవారు, మన కర్మలకు తగిన ఫలితం ఇస్తూంటారు. కారణం కార్యం రెండూ మనచేతిలోనే ఉన్నాయి. మంచి కారణంతో మంచి కార్యం చేసి మంచి ఫలితం, అమ్మవారి అనుగ్రహం పొందుదాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ