మరణించే వరకూ ఇష్టమయినది కడుపునిండా తినడం అదృష్టం - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" అన్నదా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 669 వ నామం.

" అన్నదా " అంటే జీవులకు అన్నమును ఇచ్చునది అని అర్ధం. అన్నం అంటే తినుబండారం. వేలకోట్లు ఉన్నా తెల్లవారితే కావలసినది తిండే. ఆశ్చర్యకరం ఏమిటంటే పేదవాడయినా కోటీశ్వరుడయినా తినగలిగేది కడుపు పట్టినంతే. కొద్దిగా ఎక్కువ తిన్నా అనారోగ్యంతో బాధపడాలి.

మనుషులకు, జంతువులకు, పక్షులకే కాదు క్రిమికీటకాలకు కూడా ఆహారం అవసరమే. కొన్ని క్రిమికీటకాలు ఏమి తిని బ్రతుకుతున్నాయో కూడా తెలియదు. అంత అద్భుతంగా ఆహారాన్ని సమకూరుస్తున్నారు అమ్మవారు.

ఆహారం వృధా చేస్తున్నారు, పాలు అభిషేకాలు చేసి, పుట్టలలో పోసి వృధా చేస్తున్నారు అని కొందరు విమర్శలు చేయడం చూస్తూంటాం. మన ఋషులు ఇవన్నీ ఆలోచించకుండా ఏర్పాటు చేసినవి కావు. ఎన్నో క్రిమికీటకాలు, సూక్ష్మజీవులు ఇలా పడేసిన ఆహారాన్ని తిని జీవిస్తున్నాయి.

పరమాత్మ గీతలో ఈ ఆహారం గురించి అద్భుత విషయాలు వివరించారు:

" ఆహారస్త్వపి సర్వస్య 

  త్రివిధో భవతి ప్రియః,

  యజ్ఞస్తపస్తథా దానం 

  తేషాం భేదమిమం శృణు "

            - భ.గీత 17:7

" ప్రజలు ఇష్టపడే ఆహారం వారి వారి స్వభావాన్ని బట్టి ఉంటుంది. త్యాగం, కాఠిన్యం మరియు దాతృత్వం పట్ల వారు మొగ్గు చూపే విధం వారు తీసుకునే ఆహారంమీద ఆధారపడి ఉంటుంది " అన్నారు పరమాత్మ.

కొందరు ఎప్పుడూ ఎలా ఎవరిని హింసిద్దామా, మోసం చేద్దామా అని చూస్తూ ఉంటారు. పరమాత్మ చెప్పినది ఇలాంటివారు తినేది పాపపుకూడు అంటే‌ దోషంతో కూడుకున్న ఆహారం అని. 

అలాగే కొందరు ఎలా ఎక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందా, అవసరమయిన వారిని ఆదుకుందామా అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు తీసుకునేది సాత్వికాహారం, మితాహారం.

ఆహారానికి ఎన్ని దోషాలున్నా అమ్మవారికి నైవెద్యం పెడితే అది ప్రసాదం, దోషరహితం అవుతుంది అని శాస్త్రోక్తం. అటువంటి ప్రసాదం భుజిస్తే మంచి మంచి ఆలోచనలు వస్తాయి, చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది అని మన సనాతనధర్మం తెలియచేస్తూంది.

బ్రతికినంతకాలం నచ్చిన ఆహారం తీసుకోవడమనేది ఒక భాగ్యం. అలా తీసుకునేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ