అమ్మవారి నేర్పరితనం సృష్టిలో ప్రతీ విషయంలోనూ కనబడుతుంది - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" విదగ్ధా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 904 వ నామం . 

" విదగ్ధా " అంటే మంచి నేర్పు గలది. అమ్మవారు చాతుర్యశీల - చాతుర్యం కలిగినది. అంత నేర్పరి కాకపోతే సృష్టి అంతా ఇంత అద్భుతంగా ఎలా ఉంటుంది. 

ఓ మొక్కజొన్న పొత్తిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో జాగ్రత్తగా గీతలు గీసి అతికించినట్లుగా ముత్యాలలాంటి తెల్లని గింజలు. అవి ఆరోగ్యంగా పాడయిపోకుండానూ మనకు మంచిరుచికరంగానూ ఉండేలా పల్చటి 9/10 పొరలతో కప్పి ఉండడం. 

ఆహారం లేనిదే జీవితం లేదు. ఆహారం రుచికరంగానూ సంతృప్తిగానూ ఉండటంకోసం రకరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు. ఎంత అద్భుతం.

పక్షులు కట్టిన గూళ్ళు చూస్తే అబ్బురంగా ఉంటుంది. పక్షులలో ఎంతటి నేర్పు పెట్టారో అనిపిస్తుంది. సాలెగూడు చూసినా, గొంగళీపురుగు సీతాకోకచిలుకగా మారడం గమనించినా, రకరకాల పూవులను, పక్షులను, సూక్ష్మజీవులను చూసినా ఎంత ఆశ్చర్యం వేస్తుందో. సముద్రాలలోని రకరకాల చేపలు, వింత జంతువులను చూస్తే అసలు వాటిని ఎందుకు సృష్టించినట్లు, వాటి జీవితలక్ష్యం ఏమిటి అని ఆలోచనచేస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

కొన్ని జీవులు మనకు మేలు చేసేవి, కొన్ని కీడు చేసేవి, ఒక జంతువు ఇంకో దానికి ఆహారం. ఇలాంటి విషయాలను గమనిస్తే వింత అనిపిస్తుంది. 

నిరంతరం పరిశోధనలు జరుగుతున్నా నేటికీ కొన్ని జీవుల గురించి, వాటి జీవనశైలి గురించి శాస్త్రజ్ఞులకు తెలియటం లేదంటే సృష్టిలో అమ్మవారి నేర్పరితనం ఆశ్చర్యంగానే ఉంటుంది. అసలు ఇప్పటికీ మానవాళికి తెలియని జీవులెన్ని ఉన్నాయో అమ్మవారి సృష్టిలో.

సృష్టిని ఇంత ఆకర్షణీయంగా చేసి మన జీవితాలలో సుఖసంతోషాలు కలిగిస్తూన్న అమ్మవారికి కృతజ్ఞతలు తెలియ చేసుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ