అమ్మవారి సౌందర్యం ఊహకందదు - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" అచిన్త్యరూపా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 554 వ నామం.
" అచిన్త్యరూపా " అంటే ఊహింపశక్యముకాని రూపముకలది. అమ్మవారిని వర్ణించాలంటే సరైన ఉపమానాలు దొరకాలి కదా.
ఊహించడం ఏమిటి ?. అమ్మవారిని నేరుగా చూడగలరా ఎవరయినా. కోటిసూర్య సమప్రభా అమ్మవారు. ఓ సూర్యుడినే నేరుగా చూడలేకపోతున్నాం కదా. కోటిసూర్యుల సమమయిన అమ్మవారిని ఎలా చూడగలం.
శంకరాచార్యులు సౌందర్యలహరి గానంచేస్తూ అమ్మవారి సౌందర్యాన్ని గురించి ఇలా అన్నారు:
" త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే
తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి
విరించిప్రభృతయః, యదాలోకౌత్సుక్యాత్
అమరలలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్యపదవీమ్ "
" అమ్మా, బ్రహ్మాదులైన కవీంద్రులు కూడా నీ చక్కదనమునకు సాటి ఇది అని చెప్పలేక కష్టపడుతున్నారు. నిన్ను చూడవలెననే ఉత్సుకతతో మనస్సుచేత తపస్సులకు కూడా పొందనలవికాని శివసాయుజ్యమును పొందుతున్నారు " అని అర్ధం.
ఓ అమ్మాయి అందాన్ని వర్ణించాలంటే ముఖం చంద్రబింబంలా ఉందని, కనులు కలువపువ్వుల్లా ఉన్నాయంటారు కవులు. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించడానికి బ్రహ్మాదికవులకు కూడా తగిన ఉపమానాలు దొరకటం లేదుట.
ఈ శ్లోకంలో " అమరలలనలు " అనే పదం వాడారు శంకరులు. అప్సరసలు అని. వారు ఎంతో అందంగా ఉంటారు. వారే అమ్మవారి ఓ అంశమాత్రపు సౌందర్యం చూసి ఆశ్చర్యపోయి శివసాయుజ్యం పొందితేనే అమ్మవారి సౌందర్యాన్ని సంపూర్ణంగా చూడగలమని భావిస్తున్నారుట. అంటే శివసాయుజ్యం పొందితే శివుని చూపులద్వారా అమ్మవారి పూర్తి సౌందర్యాన్ని చూడవచ్చు అని ఆ ప్రయత్నం చేస్తున్నారుట. అమ్మవారి పూర్తి సౌందర్యాన్ని చూడగలిగేది శివుడేకదా అని భావం.
అమ్మవారిది అంతటి అద్భుతము, ఊహకందని సౌందర్యం.
మాఘపౌర్ణమి, మహామాఘి, మాఘపాదివారం నేడు. పవిత్రమైన రోజు. అమ్మవారిని ధ్యానించుకుని తరిద్దాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment