అమ్మవారిని తలచుకుంటే చాలు అనుగ్రహిస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" భావనాగమ్యా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 113 వ నామం. 

" భావనాగమ్యా " అంటే " భావనా + గమ్యా " భావనతో పొందగలిగినది అని అర్ధం చెబుతూ ఇంకో అర్ధం కూడా తెలియచేసారు. భావనా + అగమ్యా అంటే కేవలం భావనతో పొందలేనిది అమ్మవారు అని. అమ్మవారి అనుగ్రహం పొందడం అంత సులభం కాదని.

సోమదేవుడు అనే పండితుడు ఉండేవారు పాండ్యదేశంలో. అమ్మవారి పరమభక్తుడు. ఎప్పుడూ ఆవిడ ధ్యాసే. ఆయన పూర్వీకులు ఏ అవసరం వచ్చిందో కాని కొందరి దగ్గర అప్పుతీసుకున్నారు. అది వడ్డీలమీద వడ్డీలతో కలిసి ఎక్కువమొత్తం అయింది. ఈయనకు అది భారమయిపోయింది. ఓ రోజు ఇంక ఎలాగైనా వసూలు చేసుకోవలసిందే అని వచ్చి అరుగుమీద కూర్చున్నారు అప్పులు ఇచ్చినవారు. ఆయన భార్య " ఆయన పూజలో ఉన్నారు, కూర్చోండి " అని చెప్పి భర్తతో " వారు వచ్చి కూర్చున్నారు " అని చెప్పగానే ఆయన మనస్సు వ్యాకులం చెందింది. అప్పుడు ఆయన అమ్మవారి సహస్రనామపూజలో " అపర్ణ " నామం దగ్గర ఉన్నారు. ఒక్క క్షణం మనస్సులో " అమ్మా అపర్ణ అంటే ఋణములు తీర్చునది అనికదా, నన్ను ఇలా వదిలేసేవిటమ్మా " అనుకుని వెంటనే లెంపలేసుకుని " ఇటువంటి ఆలోచన " చేసేనేమిటి అనుకుని పూజలో పడిపోయారు.

అక్కడ ఓ చిన్న అమ్మాయి అరుగుమీద ఉన్నవారితో ఒక్కొక్కరి బాకీ ఎంతో అడిగి ధనం చెల్లించి అప్పుపత్రాలు మా నాన్నగారికి ఇవ్వండి అని లోనికి వెళ్ళిపోయింది. శాస్త్రిగారు వచ్చి " తొందరలో మీ అప్పు తీర్చేస్తాను " అంటే " భలేవారే మీరు పంపించిన ధనం మీ అమ్మాయి ఇచ్చేసింది, పత్రాలు మీకు ఇమ్మనడంవల్ల ఉన్నాము " అంటే శాస్త్రిగారు భోరున ఏడుస్తూ " నేనేమి పాపం చేసానమ్మా, వారికి దర్శనం ఇచ్చావా, నన్ను కరుణించక " అనుకున్నారుట. ఆయనకు ఆడపిల్లలు లేరు.

విషయం తెలుసుకుని పాండ్యరాజు ఈయన్ని మంత్రిగా చేసుకుని వారి కుటుంబానికి వంశపారంపర్యంగా మంత్రిపదవిని కట్టబెట్టి పరిపాలన చేసారు.

అమ్మలగన్న అమ్మ కనుక అంత కష్టపెట్టరు అమ్మవారు. సులభంగానే అనుగ్రహిస్తారు శ్రద్ధగా వేడుకుంటే. భావనా + గమ్యా అనే తీసుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ