పులిహోర ఇష్టం అమ్మవారికి - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" హరిద్రాన్నైకరసికా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 526 వ నామం.

" హరిద్రాన్నైకరసికా " అంటే పసుపు అన్నము ( పులిహోర ) నందు ప్రీతి గలది.

ఈ పులిహోర ఓ అద్భుత వంటకం. ఏ పండుగ అయినా ఇది ముఖ్యంగా ఉంటుంది. వినాయకచవితి, దేవీ నవరాత్రులలో రోజూ సంతర్పణలలో తీపివంటకం అంటే బూర్లు, పాయసం, మిఠాయి, జిలేబి మొ.గు నవి మారుతూ ఉంటయి కాని పులిహోర మాత్రం తప్పకుండా ఉంటుంది.

పులిహోరలో చాలా రకాలు ఉన్నాయి. చింతపండు, నిమ్మకాయ/నిమ్ముప్పు, మామిడి, దబ్బకాయ, కొబ్బరి వేసి కూడా పులిహోర చేస్తారు. పులిహోర ఉప్పుపిండి అని బియ్యపునూకతో చేస్తారు. టమోటాతో కూడా చేసుకుంటారు. అటుకుల పులిహోర ఓ ప్రత్యేక వంటకం.

క్షీరాబ్ధీద్వాదశి నాడు తీపి అటుకులతో బాటు అటుకుల పులిహోర చేసి తులసీధాత్రీ సమేత కార్తీకదయాదామోదరుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా తింటారు.

తిరుమల మొ.గు వైష్ణ్వాలయాలలో పులిహోర ఓ ప్రత్యేకమయిన పవిత్రమయిన ప్రసాదం.

ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడయినా అన్నం మిగిలిపోతే పోపువేసి నిమ్మకాయ పిండి పులిహార చేసుకుని ఫలహారం క్రింద తీసుకుంటారు. రోజూ ఇదేనా అని ఎప్పుడూ అనిపించదు.

పొరుగూరు వెళ్ళినా, వ్యాహ్యాళికి వెళ్ళినా పట్టుకువెళ్ళడానికి సులభంగానూ తొందరగా అయే తినుబండారం పులిహోరయే. తినడానికి వేరే ఏ ఆధరువు అక్కరలేదు కూడా.

వేల సంవత్సరాల క్రితం మొదలయిన ఈ పులిహోర ఇప్పటికీ కొనసాగుతూంది, ఇంకొన్ని వేల సంవత్సరాల వరకూ కొనసాగుతుంది. ఎందుకంటే అది అమ్మవారికి ప్రీతికరమయిన ప్రసాదం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్ 

*నిన్న కనకదుర్గమ్మవారి గుడిలో తయారుచేసిన వేల పులిహోర పొట్లాలను వరదబాధితులకు అందచేసారు అనే వార్త చదివినప్పుడు అమ్మవారి ఈ అద్భుత నామం జ్ఞాపకానికి వచ్చింది. శుభమస్తు

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ