అమ్మవారి ప్రసాదంతో తినడం మొదలుపెడితే నిండు నూరేళ్ళు సంతోషంగా తినగలం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" పాయసాన్నప్రియా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 480 వ నామం.
" పాయసాన్నప్రియా " అంటే పరమాన్నము ఇష్టముగా గలది. బెల్లంతో చేసిన పరమాన్నం అమ్మవారికి ఎంత ఇష్టమో. అమృతంలా ఉంటుంది.
అన్నప్రాశన చేస్తారు చంటి పిల్లలకు 5/6 వ నెలలో. మొదటిసారి ఘనపదార్ధం మొదలు పెట్టడం. బెల్లం బియ్యం ఆవుపాలతో పరమాన్నం చేస్తారు. గౌరీదేవికి పూజచేసి ఈ పరమాన్నాన్ని నైవేద్యం పెడతారు. తరువాత బంగారపు ఉంగరంతో ఆ పరమాన్నాన్ని చంటిపిల్లవాడికి నాకిస్తారు తల్లిదండ్రులు. అమ్మవారికి అతి ప్రీతికరమైన ఆ పరమాన్నంతో మొదలయిన తినడం అనే కార్యక్రమం నూరేళ్ళు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కడుపునిండా ఇష్టమయినది తినడం ఒక వరం. అది అమ్మవారే అనుగ్రహించాలి.
మాఘమాసంలో రథసప్తమినాడు, ఆదివారాలు సూర్యుడికి పూజచేసి ఈ పరమాన్నాన్నే/పొంగలిని నైవేద్యం పెడతారు. అమ్మవారి అద్భుత నామం " భానుమండలమధ్యస్థా " - సూర్యుడిలోని చైతన్యం అమ్మవారే కదా.
పితృదేవతలకు ఆబ్దీకాలు పెట్టినప్పుడు భోజనాలలో ఈ పరమాన్నం ఒక ముఖ్యమయిన వంటకం. ఈ పరమాన్నంతో నందికేశ్వరుడి నోము కూడా చేసుకుంటారు ముత్తయిదువులు.
అంత పవిత్రమయినది, రుచికరమయినది, శ్రేష్టమయినది అమ్మవారికి ప్రీతికరమయినది ఈ ప్రసాదం.
జీవితాంతమూ ఇష్టమయిన ఆహారం కడుపునిండా తీసుకునేలా అనుగ్రహించమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment