అమ్మవారి నవ్వు బహు సుందరం - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" చారుహాసా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 242 వ నామం.
" చారుహాస " సుందరమైన నువ్వు. చారు అంటే అందమైన/సుందరమైన అని అర్దం. చక్కని నవ్వు అమ్మవారిది.
దేవతలు కొన్ని కోరికలు కోరుకుందామని అమ్మవారి దర్శనానికి వెడతారుట. అమ్మవారి చిరునవ్వుతో కూడిన ముఖం చూడగానే అన్నీ మర్చిపోతారుట. అక్కడికీ అమ్మవారు అడుగుతారుట చిరునవ్వుతో " ఇలా వచ్చారు, ఏమి కావాలి " అని. ఏమీ లేదమ్మా, మీ పాదాలకు నమస్కరించి వెడదామని అంటారుట.
ఎంత అందంగా, అద్భుతంగా లేకపోతే మూకశంకరులు అమ్మ ( కామాక్షీదేవి ) వారి కేవలం చిరునవ్వు మీద 100 శ్లోకాలు ( మందస్మితశతకం ) ఆసువుగా చెప్పగలుగుతారు.
అమ్మవారు భండాసురినిమీదకు యుద్ధానికి బయలుదేరగానే భండాసురుడు అనుకున్నాడు " ఆవిడ ఒక స్త్రీ, మంత్రి, సేనాని కూడా స్త్రీలుట, ఆవిడ చేతుల్లో ఉన్నవి చెరుకుగడ విల్లు, పూలబాణాలు. చిటికలో ఓడించి తరిమివేయవచ్చు " అని.
ఎప్పుడయితే వారాహీదేవి తన సేనలతో ఊతకోచమొదలెట్టి లక్షలమంది రాక్షసులను మట్టుబెట్టడం మొదలుబెట్టిందో భండాసురుడు ఆశ్చర్యపోయి కలవరం చెందాడు. వాడికి తమ్ముడు ఉన్నాడు, విశుక్రుడు. వాడు " నువ్వు దిగులుపడకు, నాదగ్గర చక్కటి ఉపాయం ఉంది, వారినీ వారి సేనలని నిర్వీర్యం చేసేస్తాను చిటికెలో " అని భండాసురుడిని ఓదార్చాడు.
వాడు సామాన్యుడు కాడు. లేకపోతే త్రిమూర్తులే అమ్మవారికి ఎందుకు అప్పచెబుతారు వారిని సంహరించే కార్యక్రమాన్ని. విశుక్రుడు " జయవిఘ్నశిలాయంత్రం " తయారు చేసాడు. దానిలో " అలస, దీన, నిద్ర, తంద్ర, కార్పణ్య, నిరహంకార, క్లీబ, ప్రమీలిక " అనే 8 దుర్గుణాలను/ఆటంకాలను ఉంచాడు. పూజలు చేసి, బలులు ఇచ్చి ఆ యంత్రాన్ని తీసుకుని ఆకాశానికి ఎగిరి అమ్మవారి ఆవరణలో పడేలా విసిరేసాడు. అది వెంటనే పని మొదలు పెట్టింది. సేనలన్నీ నిస్సత్తువుగా, నిరాశానిస్పృహలతో నిండిపోయి బేలగా అయిపోయి చతికిలబడ్డాయి. ఎంత ప్రోత్సహించినా ఉపయోగం లేకపోవడంతో శ్యామలా, వారాహీలు అమ్మవారికి తెలియచేసాయి.
అమ్మవారు చిరునవ్వు నవ్వి " నేను చూసుకుంటాను " అన్నారు.
ఆవిడ మహాకామేశ్వరి ( మా కులదేవత ), మహాకామేశ్వరుడివైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఆయన ఊరుకుంటారా, చిరునవ్వు నవ్వారు. ఈవిడ మురిసిపోయి మళ్ళీ చిరునవ్వు నవ్వింది. స్వామి అనుగ్రహించడం, అమ్మవారి చిరునవ్వులోంచి " వల్లభగణపతి " ఉద్భవించడం జరిగింది. ఈ గణపతినే " మహాగణపతి, లక్ష్మీగణపతి " అని కొలుస్తారు. ఇక్కడ లక్ష్మి అంటే విష్ణువు ఇల్లాలు కాదు. సంపదలు/ఐశ్వర్యాలు. గణపతి ఒళ్ళో కూర్చుని ఉంటుంది ఎల్లప్పుడూ.
" వక్రతుండ మహాకాయ " ఈయన అమ్మవారిని " ఏమి చేయాలమ్మా " అంటే అమ్మవారు చిరునవ్వు నవ్వారు - " నీకు తెలియదా నాన్నా " అన్నట్లుగా.
సైన్యం పరిస్థితికి కారణం గ్రహించి విఘ్నయంత్రాన్ని బయటకు తీసి తన దంతంతో ఒక్కదెబ్బ వేసేటప్పటికి యంత్రం పిండిపిండిగా అయిపోవడం సైన్యం మామూలు స్థితికి రావడం జరిగిపోయింది.
అంత మహత్తు అమ్మవారి చిరునవ్వుకు. సుముఖి. ఆవిడ వదనదర్శనంతోనే పాపాలన్నీ భస్మమయిపోతాయి.
అమ్మవారి మనస్సు, చూపు, నవ్వు అన్నీ లలితం. అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
( రెండవ భాగం రేపు చదువుదాం. శుభమస్తు )
Comments
Post a Comment