భక్తులకే అమ్మవారు సుందరంగా దర్శనం ఇస్తారు - చీమలపాటి సూర్యనారాయణ

 🙏"శ్రీమాత్రేనమః"🙏

" దంష్ట్రోజ్వలా " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 488 వ నామం . 

" దంష్ట్రోజ్వలా " అంటే వరాహ సమాన దంతములతో శోభించునది అని అర్థం తెలియచేసారు.

అదేమిటండీ కోరలతో ఉన్న అమ్మవారు శోభతో ఉండటమేమిటి అనుకోవచ్చు. శిష్టులకు అలాగే కనిపిస్తుంది. నృసింహస్వామి ఉగ్రరూపుడు. కాని ప్రహ్లాదుడికి ప్రసన్నమూర్తి. రక్షకుడు.

నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని " ఈ దేవతలు, యక్షులు అందరూ నన్ను చూసి గజగజ లాడుతున్నారు, నా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు. మరి నీకు భయంగా లేదా " అని అడుగుతారు. ప్రహ్లాదుడు " భయం ఎందుకు, కోరలు ఎర్రటి కళ్ళతో కూడిన మీ ముఖం ఎంత మనోహరంగా ఉందో " అని అంటాడు. భక్తుడి మొదటి లక్షణం భయం లేకపోవడం.

మనల్ని దుష్టులనుంచి, అధర్మపరులనుంచీ రక్షించేవారు ఎలా ఉండాలి. నవ్వుతూ మెత్తగా ఉంటే మనం ధైర్యంగా ఎలా ఉండగలం. 

అర్జునుడు పరమాత్మ యొక్క అసలు రూపాన్ని చూడాలని ఉందని కోరుతాడు. పరమాత్మ విశ్వరూపాన్ని ధరించారు. ఆ రూపాన్ని చూసిన సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా తెలియచేసాడు:

" అనేకవక్త్రనయనం    

  అనేకాద్భుతదర్శనం,

  అనేకదివ్యాభరణం  

  దివ్యానేకోద్యతాయుధం "

            - భ.గీత 11:10

" అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ ( విశ్వ) రూపము నందలి  ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు.  అందలి దృశ్యములు అద్భుతములు.   ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము.  ఆ పరమేశ్వరుడు  పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను " అని.

భక్తులకు విశ్వరూపం అంత మనోహరంగా ఉంటుంది. " ఇతరులకు " మాత్రం భయంకరం.

ఇక్కడ దుష్టులకు అనకుండా " ఇతరులకు " అన్నదానికి కారణం ఉంది. పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు కూడా " నీ విశ్వరూపంని చూస్తే భయంగా ఉంది, వెంటనే ఉపసంహరించు " అని వేడుకుంటాడు.

తనను నమ్ముకున్న భక్తుల వెనుక వారిని దుష్టులనుంచి, కష్టాలనుంచి రక్షించడానికి దివ్యాస్త్రములు ధరించి పరమాత్మ ఉంటారనే భావన ఎంత అద్భుతం, ఆశ్చర్యం. ఆ నమ్మకం ఎంతటి ధైర్యంని కలిగిస్తుందో. 

అమ్మవారు కోరలతో ఉన్నా రూపం సుమనోహరం. దుష్టులనుంచి శిష్టులను కాపాడుతూ ఉంటుంది ఎల్లప్పుడూ.

ఈరోజు అమ్మవారు " శ్రీ మహిషాసురమర్దినీదేవి " అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అందరినీ చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుందాం.

ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.

శుభం భూయాత్

Comments

Popular posts from this blog

సీతమ్మతల్లికి సాటి ఎవరు? - చీమలపాటి సూర్యనారాయణ

అన్నదానం వల్ల ఎవరెవరికి పుణ్యం వస్తుంది - చీమలపాటి సూర్యనారాయణ

శ్రీసరస్వతీ దేవి పుట్టినరోజు నేడు,, శుభాకాంక్షలు అందరికీ - చీమలపాటి సూర్యనారాయణ