అమ్మవారు పెద్ద ముత్తైదువ - చీమలపాటి సూర్యనారాయణ
🙏"శ్రీమాత్రేనమః"🙏
" సువాసినీ " అమ్మవారి అద్భుత నామం. ఇది శ్రీలలితాసహస్రరహస్యనామాలలో 970 వ నామం .
" సువాసినీ " అంటే చక్కని ఉనికి కలిగినది అని. ఇక్కడ ఉనికి అంటే భర్తతో ఉండడం అని. ఎల్లప్పుడూ భర్త గలది.
భూలోకంలో సువాసిని " జీవత్పతిక " అంటే భర్త బ్రతికి ఉన్న స్త్రీ. మరి అమ్మవారు?. " సర్వకాలజీవత్పతిక " అంటే శాశ్వతంగా ఉండే ఆయన్ని ( పరమేశ్వరుడిని ) భర్తగా కలిగినది.
సువాసిని భర్తకు విద్యుత్కర్మలు చేయడానికి అర్హతనిస్తుంది. భార్యలేనివారు అన్ని కార్యక్రమాలు చేయకూడదు. కూతురుకు పెళ్ళిచేస్తే కన్యాదానం కూడా చేయడానికి వీలు లేదు. అందుకే పూర్వం భార్య అకాలమరణం చెందితే వెంటనే మళ్ళీ వివాహం చేసుకునేవారు.
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. స్త్రీ అనలేదు. అంటే సువాసిని ఇంటికి వెలుగుని, గౌరవాన్ని ఇస్తుంది.
కుంతి పాండురాజుతోకానీ, సీతమ్మ రాముడితో కాని, ద్రౌపది పాండవులతో కాని అరణ్యానికి వెళ్ళనక్కరలేదు. కాని భర్త ధర్మాన్ని అనుసరిస్తూ జీవించాలంటే భార్య తోడ్పాటు అవసరం. అందుకే భర్త సంపాదించిన పుణ్యంలో సగభాగం భార్యకు లభిస్తుంది అన్నాయి శాస్త్రాలు.
" అరణ్యవాసం పూలపాన్పు కాదు, అయోధ్యలా ఉండదు, ఇక్కడే ఉండిపో " అని రాముడు చెబితే సీతమ్మ ఒక ధర్మసూక్ష్మం తెలియచేసింది జాతికి. " తల్లిదండ్రులు, తోబుట్టువులు, సంతానం ఎవరికయినా ఎవరి భాగ్యం వారిదే, ఎవరి కష్టాలు వారివే. కాని ఒక్క భార్యాభర్తలదే ఒకరి భాగ్యం ఇంకొకరిది. సుఖాలలోనే కాదు, కష్టాలలో కూడా ఒకరికి ఒకరు తోడు " అని.
అందుకే సనాతనధర్మం సువాసినికి అంతటి గౌరవం ఇచ్చింది.
దేవీనవరాత్రులలో " సువాసినీపూజ " చేస్తారు, గ్రామంలోని సువాసినీలను ఆహ్వానించి. అమ్మవారు మురిసిపోతారు.
ఈరోజు అమ్మవారు " శ్రీరాజరాజేశ్వరీదేవి " అలంకారంలో అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి పాదాలను ఆశ్రయించి అందరినీ చల్లగా చూడమని వేడుకుందాం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు - సూర్య.
శుభం భూయాత్
Comments
Post a Comment